2019 ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోకి రావాలనేది వైసీపీ ప్లాన్. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది ఆ పార్టీ. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అడుగుజాడల్లో పయనిస్తోంది. ఇప్పటివరకూ ఎదురైన ఓటములను మరిచిపోయి.. కొత్త ఉత్సాహంతో పనిచేస్తేనే ఫలితాలొస్తాయని పీకే అండ్ టీం జగన్ కు సూచించింది. ఇందుకోసం జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు.

Image result for jagan

        వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేగల ఏకైక ఆయుధం జగన్ పాదయాత్రేనని వైసీపీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి, పార్టీ కేడర్ లో నిస్సత్తువ ఆవహించడం.. లాంటివి వైసీపీని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో కేడర్ లో పూర్తి ఆత్మవిశ్వాసాన్ని తీసుకువచ్చే ఏకైక అస్త్రం పాదయాత్రేనని జగన్ తో పాటు ఆ పార్టీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి.

Image result for jagan

        2004 ఎన్నికల ముందు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేపట్టారు. అప్పుడు పదేళ్లపాటు అధికారంలో ఉన్న టీడీపీని ఓడించి వై.ఎస్. అధికారంలోకి వచ్చారు. నాడు వై.ఎస్. చేపట్టిన ప్రజాప్రస్థానమే ఆయన్ను అధికారంలోకి తీసుకువచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Image result for ysr padayatra

        2014 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 2800 కిలోమీటర్ల మేర ఆయన చేపట్టిన పాదయాత్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఏకం చేసింది. టీడీపీని అధికారంలోకి తీసుకురాగలిగింది. నాడు వై.ఎస్, చంద్రబాబులు చేసిన పాదయాత్రలు వారిద్దరినీ అధికారంలోకి తీసుకురాగలిగాయి. ఇప్పుడు వైసీపీ కూడా జగన్ పాదయాత్ర ద్వారా అధికారంలోకి రాగలగుతామనే నమ్మకంతో ఉంది.

Image result for chandrababu padayatra

        జగన్మోహన్ రెడ్డి 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయనున్నారు. తెలుగురాష్ట్రాల్లో ఇంత సుదీర్ఘ పాదయాత్ర ఇప్పటివరకూ చేయలేదని వైసీపీ చెప్తోంది. ఇదే తమకు సర్వరోగ నివారిణి అని భావిస్తోంది. జగన్ పాదయాత్ర ద్వారా నవరత్నాలను ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రజా వ్యతిరేక ఓటు సంఘటితమై తమకు విజయం కట్టబెడుతుందనేది వైసీపీ ఆశ. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: