ఒకప్పుడు తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా హ్యాండిచ్చి అధికార పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ఉన్న కొద్దిమంది లీడర్లు పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద చిక్కే వచ్చి పడినట్లుంది.

Image result for ttdp

          వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. టీటీడీపీ ప్రెసిడెంట్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీకోసం తమ శక్తికి మించి కష్టపడుతున్నారు. ఇందులో ఎవరికీ ఏమాత్రం సందేహం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఇప్పటికీ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. నాయకత్వం పెరిగితే మరింత ప్రోత్సాహం లభించడం ఖాయం.

Image result for ttdp

          అయితే.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగితే అటూఇటూ కాకుండా పోతామని, ఇప్పుడున్న లీడర్లు కూడా జారిపోయే ప్రమాదం ఉందని పార్టీలోని మెజారిటీ వర్గం చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తే మంచిదనే సలహా ఇచ్చారు. ప్రెసిడెంట్ రమణతో పాటు మెజారిటీ సభ్యులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈ అభిప్రాయాన్ని విభేదిస్తున్నట్టు తెలిసింది.

Image result for ttdp

          టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను, కేసీఆర్ తీరును ఎండగడుతున్న తాను.. ఇప్పుడు ఆయనతోనే కలిసి వెళ్లాలంటే ఎలా సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.  అదే పార్టీ నిర్ణయమైతే తన దారి తాను చూసుకుంటాననే హెచ్చరిక చేసినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Image result for ttdp

          టీటీడీపీ నేతలంతా ఓవైపు రేవంత్ రెడ్డి ఓ వైపు చీలిపోవడంతో చంద్రబాబు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారట. ఎలాగైనా ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలని యోచిస్తున్నారట. రేవంత్ రెడ్డికి ఉన్న చరిష్మా వేరు. అలాంటి నేతను పోగొట్టుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. అందుకే మధ్యేమార్గంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగే సమావేశంలో టీటీడీపీ భవిష్యత్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: