ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైసీపీ అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఆ పార్టీ నుంచి జంపింగ్ లు ఎక్కువ కావడంతో అధినేత జగన్ కు తలనొప్పిగా మారింది. కొంతమందిని జగనే స్వయంగా పక్కనపెడుతుండడం, మరికొంతమంది అధినేతనే పక్కన పెట్టడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైంది. అయితే ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తోంది.

Image result for gurunath reddy anantapur

          అనంతపురం జిల్లాలో తమకు మంచి పట్టుందని వైసీపీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అనంతలో పలువురు పార్టీ నేతలు సైకిలెక్కబోతున్నారనే వార్త జగన్ ను కలవరపెడుతోంది. ఆ జాబితాలో  మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి ముందున్నారు. రేపోమాపో ఆయన టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.


          ఈ నేపథ్యంలో వైసీపీ అనంతపురం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ఇన్ ఛార్జ్, ఎంపీ మిథున్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లాలోని వైసీపీ నేతలంతా దాదాపు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి గురునాథరెడ్డికి మాత్రం పిలుపు రాలేదు. ఆయన పార్టీని వీడడం ఖాయమనుకున్నారో ఏమో.. ఆయన్ను పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో.. గురునాథరెడ్డి అనుచరులు రచ్చ రచ్చ చేశారు.

Image result for gurunath reddy anantapur

          సమావేశం జరుగుతున్న హాల్లో గురునాథ రెడ్డి అనుచరులు ఎంపీ మిథున్ రెడ్డిని అడ్డుకున్నారు. గురునాథ రెడ్డిని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఏవేవో ఊహాగానాలు పెట్టుకుని నాయకుడ్ని పట్టించుకోకపోవడం సరికాదని హెచ్చరించారు. అయినా మిథున్ రెడ్డి నుంచి సమాధానం రాకపోవడంతో కుర్చీలు విరగ్గొట్టారు. దీంతో సమావేశాన్ని మధ్యలోనే ముగించి మిథున్ రెడ్డి బయటకు వెళ్లసాగారు. అయినా కూడా ఆగని గురునాథ రెడ్డి అనుచరులు మిథున్ రెడ్డిని మధ్యలోనే అడ్డుకున్నారు. మిథున్ రెడ్డి తన చేతుల్లో ఏమీ లేదని తేల్చేయడంతో జగన్ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ పరిణామాలను చూసిన జిల్లా వైసీపీ నేతలు కిమ్మనకుండా అక్కడి నుంచి జారుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: