130 ఏళ్లకు పైబడిన కాంగ్రెస్ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. గాంధీ-నెహ్రూ కుటుంబ నాలుగో తరం నాయకుడు.. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. సోనియా వారసుడుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ సమాయత్తమయ్యారు. ఇన్నాళ్లూ యువరాజుగా పేరొందిన రాజీవ్‌, సోనియాల ముద్దుల తనయుడు.. ఇప్పుడు ఆ పార్టీకి రారాజు.

Image result for rahul gandhi

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముందుండి నడిపించడానికి.. 132 సంవత్సరాల జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి 68వ అధ్యక్షునిగా, ఇందిరా కాంగ్రెస్ కు 6వ అధ్యక్షునిగా 47 ఏళ్ల రాహుల్‌ సిద్ధమయ్యారు. అధ్యక్షురాలిగా సోనియా గాంధీ 19సంవత్సరాల శకం ముగిసింది. రాజీవ్‌ గాంధీ దుర్మరణం పాలయ్యాక పిల్లలను తీసుకొని సొంత దేశం ఇటలీకి వెళ్లిపోదామని సిద్ధమైన సోనియాను ఆనాటి కాంగ్రెసు సీనియర్‌ నాయకులు బలవంతంగా ఆపుచేసి, నచ్చచెప్పి, అతి కష్టం మీద పార్టీ అధ్యక్షురాలిగా చేశారు. అంతే.. అక్కడి నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. సొంత దేశాన్ని మర్చిపోయారు. భారతదేశానికి అంకితమయ్యారు. శక్తిమంతురాలిగా ఎదిగారు. కొమ్ములు తిరిగిన నాయకులను, ఇందిరా గాంధీ సమకాలికులను సైతం కనుసైగలతో శాసించారు. యూపీఏ కూటమి ఏర్పాటుచేసి రెండుసార్లు కాంగ్రెస్ ను కేంద్రంలో అధికారంలోకి తెచ్చారు. ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానిగా చేసి తెరచాటు నుంచి రాజకీయాలు నడిపించారు. వాస్తవానికి పదేళ్లపాటు ఆమె పరోక్షంగా ప్రధానిగా ఉన్నారని చెప్పొచ్చు.

Image result for rahul gandhi

పార్టీపరంగా అంతా సవ్యంగా ఉన్న ఈ సమయంలో రాహుల్ ను అధ్యక్షునిగా చేయాల్సిన అవసరం ఏంటి..? అంటే.. ఓ వైపు 2019 ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. మరోవైపు సోనియా అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో భావి ప్రధానిగా రాహుల్.. పార్టీని ముందుండి నడిపించాల్సిన సందర్భం ఇదే అని సోనియా భావించారు.

రాహుల్ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే.. రాజీవ్, సోనియాల ప్రథమ సంతానంగా రాహుల్ 1970 జూన్ 19న ఢిల్లీలో జన్మించారు. తల్లి సోనియా గాంధీ జన్మతహా.. ఇటలీ పౌరసత్వం కలిగి ఉన్నా.. ప్రస్తుతం భారతీయ పౌరసత్వంతోనే ఉన్నారు. చెల్లెలు ప్రియాంకా గాంధీ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకున్నారు. రాహుల్ ఢిల్లీలోని సెయిట్ కొలంబియాలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆతర్వాత 1981 నుంచి 1983 వరకు ఉత్తరాఖండ రాష్ట్రం డెహ్రడూన్ లోని డూన్ స్కూల్ లో విద్యాభ్యాసం కొనసాగించారు. ఆ తరువాత రాహుల్ జీవితం అనేక మలుపులు తిరిగింది. 1984 అక్టోబర్ 31న నాయనమ్మ ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. వెంటనే తండ్రి రాజీవ్ గాంధీ రాజకీయాల్లో అడుగుపెట్టి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇందిర హత్య నేపథ్యంలో సిక్కు తీవ్రవాదుల నుంచి ఇంకా తమ కుటుంబానికి ముప్పు పొంచి ఉందన్న భావనతో రాజీవ్ గాంధీ.. రాహుల్, ప్రియాంకలను స్కూల్ కు పంపడం మానేశారు. అప్పటి నుంచి రాహుల్ చదువు ఇంటి వద్దే సాగింది. తరువాత 1989లో రాహుల్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చేరారు. అక్కడ ఒక ఏడాది పూర్తవ్వగానే.. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లిపోయారు. హార్వర్డ్ లో రాహుల్ విద్యాభ్యాసం కొనసాగుతుండగా.. 1991లో రాజీవ్ గాంధీపై LTTE తీవ్రవాదులు దాడి చేసి హతమార్చారు. ఈ నేపథ్యంలో మళ్లీ భద్రతా కారణాల రీత్యా.. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీకు మారిపోయారు. అక్కడే 1994లో తన బ్యాచిలర్స్ విద్యను పూర్తి చేశారు. ఆ సమయంలో భద్రతా దళాలకు, యూనివర్సిటీ అఫీషియల్స్ కు తప్ప అతను రాహుల్ గాంధీ అని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. 1995లో కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్ లో డెవలప్ మెంట్ స్టడీస్ లో ఎం.ఫిల్ పట్టా అందుకున్నారు. చదువు పూర్తి చేసుకున్న తరువాత రాహుల్ లండన్ లో ప్రముఖ మేనేజ్ మెంట్ గురు మైఖేల్ పోర్టర్ కు చెందిన మోనిటర్ గ్రూప్ లో 3ఏళ్లు ఉద్యోగం చేశారు. తర్వాత 2002లో భారత్ కు తిరిగి వచ్చిన రాహుల్.. ముంబయికి చెందిన టెక్నాలజీ ఔట్ సోర్సింగ్ సంస్థ బ్యాకప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు డైరెక్టర్ గా వ్యవహరించారు.

Image result for rahul gandhi

2004 మార్చిలో తొలిసారి రాజకీయాల్లోకి వస్తున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. 2004 మేలో జరగనున్న ఎన్నికల్లో తండ్రి రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్ లోని అమేథీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటికి అమేథీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ తన కార్యక్షేత్రాన్ని రాయ్ బరేలీకి మార్చుకున్నారు. నిజానికి రాహుల్ రంగప్రవేశం నాటికి ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. ఆ రాష్ట్రంలోని 80 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం 10స్థానాల్లో మాత్రమే ఉంది. అలాంటి పరిస్థితుల్లో రాజకీయరంగ ప్రవేశంపై రాహుల్ చేసిన ప్రకటనపై రాజకీయ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చాలా మంది.. రాహుల్, ప్రియాంకల మధ్య పోలిక తెచ్చి రాహుల్ కంటే.. ప్రియాంకే ఛరిష్మా కలిగిన నేతగా ఎదగగలదని వ్యాఖ్యానించారు. కొందరైతే ప్రియాంకను ఏకంగా దివంగత ప్రధాని ఇందిరా గాంధీతో పోలిక తెచ్చి రాహుల్ కంటే ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకువస్తే నాయనమ్మ ఇందిరా గాంధీలా విజయవంతమవుతారని జోస్యం చెప్పారు.

Image result for rahul gandhi

జనవరిలో జైపూర్ లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా రాహుల్ ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లో సోనియా తర్వాత రెండో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఇంతకాలం పనిచేసిన రాహుల్ పెద్దగా విజయాలు సాధించలేదు,. అయినా రాహుల్ పైనే ఇంకా ఆపార్టీ శ్రేణులు కొండంత ఆశలు పెట్టుకున్నాయి. రాహుల్ కు పూర్తిస్థాయిలో పగ్గాలు అప్పగిస్తే ఫలితం మరోలా ఉంటుందనేది ఆ పార్టీ సీనియర్ల భావన. తగ్గట్లే.. ఇటీవల రాహుల్ లో కనిపిస్తున్న దూకుడు, విమర్శల తీరును చూసిన నేతలు.. రాహుల్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించి.. మోదీ అధికార పీఠాన్ని కదిలించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం.. రాహుల్ కు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని భావిస్తోంది. రాహుల్ కు పగ్గాలు అప్పగించడంతో పాటు.. సీనియర్ టీమ్ లో కొంతమందిని పక్కన పెట్టి.. రాహుల్ టీమ్ కు ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు అతి త్వరలో ఏఐసీసీతో పాటు సీడబ్ల్యూసీలో సమూల మార్పులు కూడా జరగబోతున్నాయని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: