రాష్ట్ర విభజన విషయంలో ప్రధాన అడ్డంకిగా మారిన హైదరాబాద్ విషయంలో మావద్ద మూడు ఆప్షన్లు ఉన్నాయని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడింటిలో రెండో ఆప్షన్ కే కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇదయితేనే తెలంగాణ నుంచి అభ్యంతరాలు రావని, సీమాంధ్రను కూడా ఒప్పించవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.

అయితే ఆ మూడేమిటో చూద్దాం, మొదటిది హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం, దీనిని సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలవారు ఒప్పుకోకపోవచ్చు. ఇక రెండవది పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని, మూడవది దేశానికి రెండో రాజధాని. దేశానికి రెండో రాజధాని అన్నా కూడా హైదరాబాద్ తెలుగువారికెవ్వరికి దక్కదన్నట్లే, కాబట్టి దీనికి కూడా ఇరుప్రాంతాలు అంగీకరించవు. అందుకే రెండో దానినే ఓకే చేసే దిశలో కాంగ్రెస్ ఉన్నట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.

ఇక అదేంటంటే పదేళ్లు ఉమ్మడి రాజధాని, అంటే ఈ పదేళ్లు తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు హైదరాబాదే ఉమ్మడి రాజధాని, ఈ కాలంలో హైదరాబాద్ నగర పాలక సంస్థ లోని పాలనా వ్యవహారాలన్ని కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి. రెండు రాష్ట్రాల పాలన హైదరాబాద్ నుంచే నడుస్తుంది. ఈలోగా సీమాంధ్ర రాష్ట్రం వారి ప్రాంత మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు వారి రాజధానిని ఎంపిక చేసుకోవాలి.

వారు ఎంపిక చేసుకున్న రాజధానిని కేంద్రం తన నిధులతో పదేళ్లలో అభివృద్ది చేస్తుంది. పదేళ్ల తర్వాత హైదరాబాద్ ను తెలంగాణకు అప్పగిస్తుంది. ఈలోగా సాగునీటి జలాలు, విద్యుత్, ఉద్యోగాలు, ఉద్యోగుల రక్షణ, ఇలా అన్ని సమస్యలపై ఓ కమిటీ వేసి వాటికి శాశ్వత పరిష్కారాలను కనుగొని అమలు చేయడం చేస్తారు. ఇలాగయితేనే కాంగ్రెస్ తాను అనుకున్న రాజకీయ ప్రయోజనాలు నెరవేరడంతో పాటు ఇరుప్రాంతాలను ఒప్పించడం కూడా సాధ్యమే అన్న అభిప్రాయంలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: