ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మధురక్షణాలు వచ్చిన వేళ అభిమానుల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. జగన్ బెయిల్ పై సాయంత్రం నాలుగుగంటలకు చంచల్ గూడ జైలునుంచి బయటకు వచ్చిన ఆ క్షణం అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. అప్పటికే పెద్ద సంఖ్యలో చేరుకుని ఉదయం నుంచి నిరీక్షిస్తున్న వైఎస్సార్ సిపి నాయకులు, అభిమానులు పూలతో ఘన స్వాగతం పలికారు. జగనన్న వచ్చేసాడోచ్ అంటూ సంబరంతో అంబరాన్ని తాకేలా నినాదాలు చేసారు.

జగన్ తో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులకు తలకు మించిన పనయింది. మీడియా కూడా దగ్గరకు పోవడం కష్టం అయింది.  ఎలగోలా వారినుంచి తప్పించి జగన్ ను వాహనంలో లోటస్ పాండ్ కు తీసుకువెల్లారు.

జగన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో ఆయన జైలునుంచి బయటకు వచ్చారు. వాహనం ఫుట్ బోర్డుపై నిలబడ్డ జగన్ ఆయన కోసం నిరీక్షిస్తున్న తన వారికి అభివాదం చేసారు. పటిష్ట పోలీసు బందోబస్తు ఉండడంతో ఆయన వద్దకు వచ్చి కలిసేందుకు పోలీసులు అనుమతించలేదు. ప్రత్యేకమైన రూట్ లో ఆయన లోటస్ పాండ్ కు బయలు దేరారు.

అంతకు ముందు ఉదయం నుంచి జైలువద్ద రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఆయన పార్టీకార్యకర్తలు, నేతలు, అభిమానులు పండగ జరిపారు. బాణా సంచా పేలుస్తూ అభిమాన నేతను చూసేందుకు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదిరి చూసారు. డాన్స్, పాటలు, నినాదాలతో చంచల్ గూడ జైలు పరిసరాలను మారుమ్రోగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: