హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు గానూ వైఎస్ఆర్ పార్టీ ‘గడపగడపకు ’అనే కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలోని జవహర్ నగర్ లో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రారంభించారు. ప్రతి గడపకూ పార్టీని తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విజయమ్మ కిరణ్ సర్కార్ పై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు.  ప్రజలు పడుతున్న బాధలు చూస్తుంటే అసలు రాష్ర్టంలో సర్కార్ అనేది వుందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ర్టంలోని ప్రజలెవరూ సంతోషంగా లేరనీ ఆవేదన చెందారు. రైతులు, కార్మికులు, కూలీలకు ఉపాధి లేక వలసలు పోతున్నారనీ అన్నారు. రైతన్న పంటలకు విరామం ప్రకటించినా కూడా ఈ సర్కార్ మేల్కోవడం లేదన్నారు. కరంటు కోతలతో రాష్ర్టమంతా అంధకారంగా మారిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము ఎన్ని దీక్షలు చేసినా కూడా ఈ రాష్ర్ట ప్రభుత్వంపై దున్నపోతు మీద వానపడ్డట్లు ఉందన్నారు.  దివంగత రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే వారన్నారు. ఆయన లేని లోటు కొట్టొచ్చినట్లు అగుపిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. అధికార, విపక్ష పార్టీలు ఒకటై జగన్ను టార్గెట్ చేస్తున్నారనీ ఆరోపించారు. త్వరలోనే జగన్ నిర్దోషిగా మీ ముందుకు వస్తాడన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ర్టంలో రాజన్న యుగం వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. లేని మహనేతపై కొంత మంది మంత్రులు బురదజల్లుతున్నారనీ అన్నారు. ఇప్పటికైనా మంత్రులు, పలువురు నాయకులు తమ పద్దతిని మార్చుకోవాలన్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందనీ విజయమ్మ అన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, వందలాది మంది విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: