తెలుగు ప్రజల భవిష్యత్తును తేల్చే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై అసెంబ్లీలో కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. అరుపులు.. కేకలు.. ఆందోళనలు.. గందరగోళాల మధ్య పుణ్యకాలం కాస్త గడిచినా.. మొత్తానికైతే చర్చ మొదలైంది. బిల్లుపై చర్చ ముగించి.. మార్పులు సూచించేందుకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు మరో ఐదు రోజులు మిగిలి ఉంది. ఇందులో ఒక రోజు ఆదివారం సెలవును మినహాయిస్తే మిగిలింది నాలుగు రోజులే. ఇప్పటివరకు సభలో మాట్లాడింది కేవలం ఎనిమిది మంది మాత్రమే. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఎంతో కీలకమైన బిల్లు అయిన నేపథ్యంలో.. సభలోని ప్రతి సభ్యుడు తన అభిప్రాయం చెప్పేలా అవకాశం కల్పిస్తామని స్పీకరు చెప్పినా.. వాస్తవానికి అది సాధ్యమయ్యే వ్యవహారంలా కనిపించటం లేదు. ఇప్పటివరకు మాట్లాడిన ఎనిమిది మందిని మినహాయిస్తే.. ఇంకా మాట్లాడాల్సిన ముఖ్యమైన వారే చాలామంది ఉన్నారు. విపక్ష పార్టీలకు చెందిన శాసనసభా పక్ష నేతలతో పాటు.. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మాట్లాడాల్సి ఉంటుంది. మిగిలిన పార్టీలకు చెందిన శాసనసభాపక్ష నేతలు మాట్లాడేందుకు ఒక రోజు మొత్తం పడుతుందని లెక్క వేసినా.. ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత సుదీర్ఘంగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరికే రెండు రోజులు పూర్తిగా సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. అంటే చేతిలో ఉన్న నాలుగు రోజుల సమయం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. ఈ నేపథ్యంలో గడువు పెంపు తప్పనిసరి. బిల్లుపై చర్చకు సమయం పెంచేందుకు ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన 45 రోజుల అదనపు సమయం అడిగే వీలుందని చెప్పొచ్చు. నిజానికి సీఎం కిరణ్ అడిగిన వెంటనే అదనపు సమయం రాష్ట్రపతి ఇస్తారన్న నమ్మకం లేదు. కాకపోతే.. సమైక్యవాదిగా ఆఖరి బంతి వేయటానికి ఎంత ఆలస్యమైతే అంత ఆలస్యం చేద్దామని కిరణ్ భావించి ఉండొచ్చు. క్రికెట్ మ్యాచ్ లో ఓటమి ఖాయమైన సమయంలో సదరు జట్టు సభ్యులంతా ఒకే ఒక్క కోరిక కోరుకుంటారు. ఆకస్మాత్తుగా భారీ వర్షం పడితే ఎంత బాగుండు అని. సరిగ్గా అలాంటి వైఖరినే ముఖ్యమంత్రి అనుసరిస్తున్నారు. బిల్లు ఆపే శక్తి ఆయనకు లేని నేపథ్యంలో.. సాంకేతికంగా పీటముళ్లు వేసి.. ఎన్నికల వరకూ ఏమీ తేలకుండా చేయగలిగితే.. తర్వాతి వ్యవహారం అదే జరుగుతుందన్నది ఆయన ఆశ. ఒక సమైక్యవాదిగా ఆయన అలా ఆశ పడటంలో తప్పు లేదు. అదే సమయంలో ఆయనకు భిన్నమైన ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. విభజన వ్యవహారంతో రానున్న ఎన్నికల్లో లబ్ధిని పొందాలని భావిస్తున్న సోనియా.. కిరణ్ అనుకున్నదానికి పూర్తి భిన్నంగా ఆలోచించే వీలుంది. అలా కాని పక్షంలో రెండింటికి చెడ్డ రేవడిగా కాంగ్రెస్ మిగిలే ప్రమాదం ఉంది. తాను అనుకున్నట్లు ఎన్నికలకు ముందే తెలంగాణ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలన్న పట్టుదలతో ఆమె ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఓ రకంగా ఆలోచిస్తుంటే.. అందుకు భిన్నమైన మార్గాల్లో కిరణ్ పయనిస్తున్నారు. వీరిద్దరిలో సోనియమ్మ రాజీ పడే సమస్య ఉండదు కాబట్టి.. కిరణ్ ను ఏ విధంగా ఆమె కట్టడి చేస్తారా? అన్న సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. ఇక.. తెలంగాణ.. సీమాంధ్ర నేతల విషయానికొస్తే.. టీ నేతలు మెరుగైన పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. లక్ష్యానికి వారు చాలా దగ్గరగా ఉన్నారు. ఈ విషయంలో సీమాంధ్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి దగ్గర సరైన వ్యూహం లేకపోవటం.. సమైక్యవాదుల్ని నడిపించే నేత ఎవరూ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. బయట మాదిరే.. అసెంబ్లీ లోపల పరిస్థితి తెలంగాణ నేతలకు అనుకూలంగా ఉందనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా తమకు జరిగిన అన్యాయం గురించి వందల సార్లు మాట్లాడిన వారికి.. తమ వాదనను డ్రమెటిక్ గా చెప్పే ప్రయత్నంలో ఉంటే.. సీమాంధ్ర నేతలు తొలిసారి దాన్ని ధీటుగా ఎదుర్కొనే విషయంలో తడబడుతున్నారు. ఈ విషయంలో తప్పు సీమాంధ్ర నేతలదే. తెలంగాణ విషయం మీద గతంలో చాలాసార్లు మాట్లాడినప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు ఏ నేతా పెద్దగా ఎక్సర్ సైజ్ చేసింది లేదు. ఈ ప్రభావం అసెంబ్లీలో స్పష్టంగా కనిపిస్తోంది. పక్కాగా ప్రాక్టీసు చేసి.. మాంచి వ్యూహంతో గ్రౌండ్ లోకి దిగిన ఓ అంతర్జాతీయ జట్టుతో.. ఎలాంటి ప్రాక్టీసు లేకుండా కేవలం డబ్బు.. పరపతి అన్న రెండింటితో నేతలుగా మారిన వారు ఇప్పుడు గొంతు విప్పలేకపోతున్నారు. దీంతో వారి మాటలు విపరీతంగా తడబడుతున్నాయి. సంక్రాంతి పండగ సెలవులకు ముందు.. సభలో మాట్లాడిన టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ప్రసంగానికి.. పండగ సెలవుల తర్వాత మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర నేత శైలజానాథ్ స్పీచ్ ను చూస్తే విషయం ఇట్టే అర్థమవుతుంది. అవసరం లేకపోయినా.. నవ్వటం.. ధీటుగా బదులివ్వాల్సిన సమయంలో... ‘‘నేను ఇప్పుడు మాట్లాడటం మొదలు పెడితే విషయం ఎక్కడికో వెళుతుంది. అంతదాకా రానివ్వకండి’’ అంటూ బడాయి మాటలు తప్ప.. టీ నేతలు చేసే కామెంట్లకు శైలజానాథ్ ధీటుగా బదులివ్వలేకపోయారు. టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ తన ప్రసంగంలో భావోద్వేగాన్ని పండించి.. తెలంగాణ డిమాండ్ ఎంత సహేతుకం అన్న విషయాన్ని విషాదంతో చెబితే... శైలజానాథ్ ప్రసంగం చప్పగా సాగింది. ప్రాంతీయవాదం తీవ్రమైన భావోద్వేగానికి సంబంధించిన అంశమన్నది మర్చిపోకూడదు. విభజనపై మాట్లాడే ఏ సీమాంధ్ర నేత అయినా ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ విషయంలో తెలంగాణ నేతలు సీమాంధ్ర నేతల కంటే చాలా ముందున్నారు. ఇప్పటివరకూ మాట్లాడిన ఎనిమిది మంది సభ్యుల విషయానికే వస్తే.. ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మాట్లాడిన ఎనిమిది మందిలో తెలంగాణ నేతలే ఎక్కువ. వారి మధ్య ఇప్పుడు విభజన కంటే మరో పెద్ద విషయం నలుగుతోంది. తెలంగాణ సాధనలో చాంఫియన్ ఎవరు అన్న విషయాన్ని తేల్చుకునేందుకు వారు విపరీతంగా శ్రమిస్తున్నారు. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ తమ పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయన్న విషయాన్ని చెప్పుకునేందుకు విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వటమే కాదు.. తాము చేసిన పోరాటాల వల్లనే కాంగ్రెస్ తలొగ్గి తెలంగాణ ఇచ్చిందని చెప్పుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. తమ వాదనలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై హోల్ సేల్ గా విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్ నేతల్ని నిలువరించటంతో పాటు.. ఎవరెన్ని పోరాటాలు చేసినా.. తమ అధినేత్రి చలువ వల్లనే తెలంగాణ స్వప్నం సాకారమవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదన్న వాదనను తెలంగాణ కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. తెలంగాణపై తమ అధినేత్రి సోనియా సానుకూలంగా ఉన్నారు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం అవుతుందే తప్ప మరొకటి కాదని వారు తేల్చి చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ నేతల్ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక.. మిగిలిన టీడీపీ నేతలు సైతం తక్కువ తినలేదనే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని పోరాటాలు చేసినా.. ఆ పార్టీ స్వార్థ రాజకీయాల కోసమే తెలంగాణ నినాదాన్ని వాడుకుందే తప్ప మరొకటి కాదని తెల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ తో కుమ్మక్కు అయి అమాయకుల ప్రాణాలు పోవటానికి కారణమయ్యారంటూ టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. తమ అధినేత చంద్రబాబు తెలంగాణపై లేఖ ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ వైఖరిలో మార్పు వచ్చిందే తప్ప.. అంతకు మందు కాదంటూ వారు తమ వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్ని తోడు దొంగలుగా అభివర్ణిస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమ తమ రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు విభజన బిల్లుకు సంబంధించి చర్చను వాడుకుంటున్నారే తప్ప.. ప్రజల గురించి పట్టించుకుంటున్నది ఏమీ లేదనే చెప్పాలి. తెలంగాణ నేతలంతా తెలంగాణలో అధిపత్యం కోసం పోరాడుతుంటే.. సీమాంధ్ర నేతలు పస లేని సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారు. విభజన వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందని.. విభజన ప్రక్రియలో సీమాంధ్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందన్న విషయాన్ని వారు బలంగా వినిపించటంలో వెనుకబడిపోయారనే చెప్పాలి. విభజన అనివార్యమైనప్పుడు.. ఇరు ప్రాంతాలు పచ్చగా ఉండాలన్న భావన నేతల్లో ఉంటే.. రాజకీయ రచ్చ కంటే కూడా నిర్మాణాత్మకంగా మాట్లాడే వారు. ఎవరికి ఏం అవసరం? వాటిని ఎలా రాబట్టుకోవాలన్న అంశాలపై దృష్టి నిలిపేవారు. కానీ.. ఇప్పుడు జరుగుతున్నది అందుకు పూర్తి భిన్నమైనది. సమకాలీన రాజకీయాల్లో ఉన్నత భావాల్ని ఆశించటం కూడా అత్యాశే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: