ఆయన స్థాయి అలాంటిలాంటిది కాదు... ఏకంగా భారత ప్రధానమంత్రే క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేసి "జేపీ గారు, ఈ సమస్యను ఎలా ఎదుర్కొందాం...'' అని అడుగుతారట. ఈ విషయాన్ని చెప్పుకొన్నది కూడా జేపీ అనబడే లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణే! మరి మేధావి వర్గానికి చెందిన జేపీ సార్ ప్రధానమంత్రికి ఎలాంటి సలహాలు ఇస్తున్నాడో కానీ... రాష్ట్ర విభజన విషయంలో ఆయన చెబుతున్న మాటలు, ఆయన ఆలోచన తీరు మాత్రం పరిష్కారానికి పాతికమైళ్ల దూరంలో ఉంది. జాతీయ స్థాయి లో వచ్చే సమస్యలకు ప్రధానమంత్రికి పరిష్కారాలు చెబుతాననే జేపీ ఆంధ్రప్రదేశ్ లో తలెత్తిన విభజన సమస్య గురించి మాట్లాడుతున్న తీరు అర్థరహితంగా కనిపిస్తోంది. మరి ఏ విషయం మీదైనా క్లారిటీగా మాట్లాడే జేపీకి విభజన వ్యవహారానికి వస్తే చాలు.. మాట ఎందుకు తడబడిపోతోంది? నిన్నటివరకూ విభజనకు వ్యతిరేకంగా గళమెత్తిన ఆయన.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని ఎందుకు తేల్చేశారు? విభజన ప్ర్ర్రక్రియ దారుణంగా ఉందని.. కేంద్రం మీద విరుచుకుపడిన ఆయన.. సీమ మీద ప్రత్యేక ఫోకస్ చేశారెందుకు? మేధావిగా పేరొందిన జేపీకి సైతం విభజన వ్యవహారం ఒక పట్టాన ఎందుకు కొరుకుడు పడటం లేదు...ఇవన్నీ ఆసక్తికరమైన నిజాలు దాగున్న విషయాలు. విభజన విషయంలో జేపీ అడ్డంగా బుక్ అయిపోయారనే చెప్పాలి. మిగిలిన నేతల మాదిరే తెలంగాణ అంశంపై కప్పదాటు వ్యవహారాన్నే జేపీ అనుసరించారు. ఆ తర్వాత ఏమనుకున్నారేమో కానీ.. ప్రాంతం సరిహద్దులు మారినంత మాత్రాన ప్రజల బతుకులేమీ మారవంటూ ఆయన వ్యాఖ్యలు చేయటం మొదలుపెట్టారు.దీంతో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారన్న వాదన పెరిగి.. జేపీ మీద ఒత్తిడి వచ్చింది. చివరికి ఆయన పార్టీ సైతం ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం ఏమైపోయినా ఫర్లేదు.. పార్టీకి మాత్రం ఇసుమంత నష్టం జరగకూడదన్న భావన ఆయన్నుతెలంగాణపై మరోమారు మాట మార్చే వ్యక్తిగా మిగిల్చింది. చివరకు.. కాంగ్రెస్ పార్టీ విభజన అంశంపై క్లియర్ గా తేల్చేయటంతో.. విభజన అడ్డగోలు వ్యవహారం అంటూ జేపీ గొంతు సవరించుకున్నారు. సీమాంధ్రలో ఎగిసి పడిన ఉద్యమం నేపథ్యంలో.. దాదాపుగా నెల రోజుల ఆలస్యంగా సమైక్యవాదులను సముదాయించడానికి ఆయనో యాత్రను మొదలుపెట్టారు. కానీ.. కర్నూలు, అనంతపురం ప్రజలు యాత్రను అడ్డుకోవటమే కాదు.. ఆయనపై భౌతికదాడి చేసినంత పని చేశారు. దాంతో ప్రజల అగ్రహావేశాల్ని దగ్గర నుంచి చూసిన జేపీ.. వెంటనే తన యాత్రను రద్దు చేసుకొని.. హైదరాబాద్ కి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ పెద్దగా గొంతు విప్పలేదు. స్పష్టంగా అభిప్రాయం చెప్పాల్సి వచ్చిన సమయంలో సమైక్యవాదిగా స్వరం పెంచిన ఆయన.. అసెంబ్లీ ప్రాంగణంలో మరోసారి టీఆర్ఎస్ నేతల అగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే క్రమంగా జేపీ మాటలు రాజకీయం అయ్యాయి. రాష్ట్ర విభజన విషయంలో ఆయన మాట్లాడిన మాటల అసలు ఉద్దేశం ఏమిటో కానీ... ఆ మాటలు మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. అందులో ప్రముఖమైనది రాష్ట్ర విభజన సమస్యకు కారణం వైఎస్సార్ అని వ్యాఖ్యానించడం. తెలంగాణ సమస్య వైఎస్ కు ముందు, వైఎస్ కు తర్వాత కూడా చాలా టర్న్ లు తీసుకొంది. మరి అర్థం లేకుండా వైఎస్సార్ ను నిందించడం ఏమిటి? వైఎస్ అధికారంలోకి రావడానికి తెలంగాణను కూడా ఒక ఎత్తుగా ఉపయోగించుకొంటే ఉపయోగించుకొండువచ్చు గానీ... అధికారం చేతికందాకా మాత్రం సమైక్యవాది అయ్యాడు. అలా పోతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణ అంశాన్ని ఎన్నికల అజెండా చేసుకోలేదా? తెలంగాణకు సై 2009 కి ముందు తర్వాత ప్రకటించలేదా? ఈ విషయం జనాలకు అర్థం కాదను కొని జేపీ వైఎస్ పై విమర్శలు చేశాడు, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పై అస్త్రాలు సంధించాడు. ఇవి కూడా విచిత్రమైనవే! అందరిలాగే జగన్ కూడా తెలంగాణ ఇష్యూతో కొన్ని రోజులు గేమ్స్ ఆడాడు. అయినప్పటికీ జేపీ టార్గెట్ లో మాత్రం జగన్ పార్టీ నే అయ్యింది. మరి ఈ వ్యవహారాలన్నింటినీ బట్టి జేపీ రాజకీయంగా తెలుగుదేశం ప్రాపకం సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడని అనుకోవాల్సి వచ్చింది. ఇది తెలంగాణ అంశానికి సంబంధించి లోక్ సత్తా రాజకీయ అధ్యాయానికి సంబంధించిన వ్యవహారం, అంతర్గత వ్యవహారం అనుకొన్నా.. ఇప్పుడు విభజన అని వార్యం అనే మాట మాత్రం జేపీపై సమైక్యవాదుల ఆగ్రహానికి కారణం అవుతోంది. జేపీని రాష్ట్రం మొత్తం ఆదరించింది.. అభిమానించింది. ఆయనపై ఎంతో నమ్మకం ఉంచింది. అయితే.. వారిపై ప్రజలు చూపుతున్న అభిమానాన్ని సమయానుకూలంగా పెంచుకుంటూ పోయి.. ఢిల్లీలో కేజ్రీవాల్ లా మ్యాజిక్ చేసి పార్టీని అధికారంలోకి తేలేకపోయారు. ఇక్కడ పరిస్థితులు కూడా వేరనుకోండి. 2009 ఎన్నికల్నే తీసుకుంటే.. ఆయన పార్టీ అభ్యర్థులకు సరాసరిన.. 3 వేల నుంచి 8వేల ఓట్ల వరకూ అన్ని నియోజకవర్గాల్లో వచ్చాయి. ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా.. వచ్చిన ఓట్లవి. కానీ మెజారిటీ ప్రజలకు నమ్మకం కలించేటంత విస్తృత ప్రయో'జన' ప్రణాళిక ఆయన ప్రజల ముందు పెట్టలేదు. తాజాగా విభజన విషయంలోను ఆయన అలాంటి పొరపాటే చేస్తున్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విభజన వ్యవహారంలోనూ ఆయన అంచనాలు తప్పాయని చెప్పొచ్చు. ముందు నుంచి ఒకే నిర్మాణాత్మక ప్రణాళికతో ఆయన వ్యవహరించి ఉంటే ఈరోజు ఆయనకు సీమాంధ్ర నుంచి కూడా అభినందనలు దక్కేవి. ఒక మంచి వక్త.. ఏ విషయం మీదనైనా అనర్గళంగా మాట్లడగలిగిన వ్యక్తి.. విభజన వ్యవహారంపై క్లారిటీ లేకుండా మాట్లాడటం.. తడవకో రకంగా మాట్లాడటం ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. తాజాగా ఆయన చేసిన ప్రసంగాన్ని చూసినప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం ఖాయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని తేల్చి చెప్పిన ఆయన..టీఆర్ఎస్ అగ్రహం నుంచి తప్పించుకున్నారనే చెప్పాలి. అంతే కాదు.. ఇప్పటివరకూ ఏ నేతా చేయని కొన్ని వ్యాఖ్యల్ని ఆయన చేశారనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమాత్రం ఆలస్యం జరిగినా.. అది ఏమాత్రం మంచిది కాదని.. మనసులు విరిగాక కలిసి ఉండటం అసాధ్యమని.. అన్నీ విషయాల మీద చర్చలు జరిపి.. విభజన చేసుకోవటమే ఉత్తమం మార్గంగా ఆయన తేల్చేశారు. విభజనతో తెలుగునేల తల్లడిల్లుతోందని.. ఆంధ్రావనిలో రాజకీయం అంపశయ్య మీద ఉందని వ్యాఖ్యానించిన ఆయన.. మితిమీరిన అస్థిత్వ ఆరాటం ప్రమాకరమని చెప్పుకొచ్చారు. జేపీ ప్రసంగాన్ని చూస్తే ఆయన తన మనసులో మాటను సూటిగా చెప్పకుండా.. నర్మగర్భంగా చెప్పారనిపిస్తుంది. విభజనపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయాన్ని స్పష్టం చేసిన ఆయన.. మరో డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. కాకపోతే.. తాను ఆ మాట సూటిగా ప్రస్తావిస్తే.. ఆంధ్రప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న సందేహంతో ఆయన.. రాయలసీమ నినాదాన్ని బయటకు తీశారు. మిగిలిన ప్రాంతాల కంటే రాయలసీమ దారుణంగా దెబ్బ తిందని.. ఆ ప్రాంతానికి విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుందని.. అన్ని ప్రాంతాల కంటే ఆదాయం తక్కువని చెబుతూనే.. ప్రత్యేక ప్రాంతంగా గుర్తింపు పొందితే.. ఏటా పదివేల కోట్ల రూపాయిలు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉందన్నారు. తాజా టర్న్ తో విభజన వ్యవహారంలో ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించలేకపోయారన్నది తేలిపోయింది. విభజన వ్యవహారం మీద ఇప్పటికే మూడునాలుగు సార్లు పిల్లిమొగ్గలు వేసిన ఆయన మూడు రాష్ట్రాల ఏర్పాటు అంచుల దాకా వెళ్లి ఆగారు. సీమలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే ఆశ సీమ ప్రాంత ప్రజల్లో ఏమాత్రం లేకపోవడం వల్లే ఆయన అక్కడ ఆగారు. జేపీ లాంటి వ్యక్తి కూడా ప్రజలకు నచ్చింది చెప్తే ఎలా... మంచి చెప్పి ఒప్పించాలి. అదేదో సినిమాలో చెప్పినట్లు ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ.. నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేనే లేరన్నది అక్షర సత్యం. దానికి నిలువెత్తు ఉదాహరణ జేపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: