కలలెరుగని కన్నులెన్ని అలలెరుగని తీరాలెన్ని గతుకులెరుగని దారులెన్ని కష్టాలెరుగని జీవితాలెన్ని ఓటమి నిన్ను వెక్కిరించినపుడు జీవితాన్ని అంతం చేసేకంటే, దండయాత్ర చేసి విజయాన్ని వశం చేసుకో. శిశిరంలో తన ఆకుల్ని రాల్చిన కాలాన్ని సైతం, వసంతంలో కొత్త చిగుళ్ళతో చెట్టు వెక్కిరిస్తుంది. కాని మనం మాత్రం విధి పెట్టే పరీక్షల్లో విఫలమయితే విధాతను చేరుకోవాలనుకుంటున్నాం. జీవనప్రయాణంలో అణువణువూ మనకు అనువుగా ఉండదు కానీ ఏదో ఒక తరుణంలో నీ శ్రమకి తగ్గ ఫలితం దొరుకుతుంది. నిరీక్షిస్తే విజయం నీ సొంతమవుతుంది. ఈ లోకం నుండి నిష్క్రమిస్తే నీ జీవితం అంతమవుతుంది. ఇది గ్రహించలేని జనాలవల్ల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుంది. ఇష్టంతో కష్టిస్తే అభీష్టాన్ని చేరుకోవటం అత్యంతసులువవుతుంది. మిత్రమా...నడిస్తే దూరం అనుకున్నది దగ్గరవుతుంది. ప్రయత్నిస్తే దక్కదనుకున్నది సొంతమవుతుంది. నిన్ను నువ్వు చంపుకుంటే విలువైన నీ జీవితం వ్యర్దమవుతుంది. ఏ సమస్యకుండే పరిష్కారపట్టికలోనూ చావుకి తావు లేదు. అలజడి సవ్వడి చేయని జీవనప్రయాణం ఉండదు. నూతన ఒరవడిలో ప్రయత్నిస్తే గెలుపు నీదవ్వకపోదు. విఫలమైన తొలియత్నంలోనే విరమించుంటే మన సాంకేతిక పరిజ్ఞానం ఈనాటికిలా ఉండేది కాదు. దీనిని ఆదర్శంగా తీసుకోమని నేను చెప్పను కానీ ఆలోచించు. ఓడిపోతే మళ్ళీ ప్రయత్నించు. గెలిస్తే నీ మనసుని తదుపరి అంశంపై మళ్ళించు. గుర్తుంచుకో నీ జీవితం ఒక అద్భుతం. అడుగు వేయకుండా ప్రయాణం మొదలవ్వదు. ఆత్మహత్య మహాపాపం. నీ వారి పాలిట ఒక శాపం. ఏ క్షణంలోనూ దాన్ని ఆశ్రయించకు.అసలెన్నడూ దాని గురించి ఆలోచించకు. నీ జీవితాన్ని అంతమొందించాలనుకునే ఒక్క క్షణం ముందు నీ ప్రయాణంలోని మధురానుభూతుల్ని గుర్తుతెచ్చుకో. నిన్ను నమ్మిన నీవారిని తలచుకో. అప్పటికీ చనిపోవాలనిపిస్తే, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే నిన్ను శిక్షించుకోవట్లేదు, నీ వారిని మనోక్షోభకు గురి చేస్తున్నానని ఆలోచించు. నా ఈ కొన్ని వాక్యాలవల్ల కొందరి ఆలోచనలయిన మారాలని ఆశిస్తూ.....

మరింత సమాచారం తెలుసుకోండి: