ఏ పార్టీతోనూ పొత్తు లేకపో యినా, ఎన్నికల్లో పోటీ చేయకపోయినా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ మంగళవారం నుండి భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం మొదలుపెట్టనున్నారు. అయితే ఆయన ప్రచారం చేస్తున్నది ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ కాదు అటు తెలంగాణా రాష్ట్రంలోనూ కాదు. కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు తదితర ప్రాంతాల్లో భాజపా అభ్యర్ధుల తరపున మంగళవారం ప్రచారం చేసేం దుకు వవన్‌ వెళుతున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో పవన్‌ బేగంపేట నుండి బెంగుళూరు చేరుకుని అక్కడి నుండి రాయచూరు చేరుకుంటారు. భాజ పా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పవన్‌ను కలి సి తమ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయాల్సిందిగా చేసి న అభ్యర్ధనను ఆయన అంగీకరించారు. పవన్‌కు కర్నాటక రాష్ట్రంలో ఉన్న అభిమానలను తమ పార్టీ వైపు ఆకర్షించేందుకు భాజపా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే, కర్నాటకలో భాజపా తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా పనిచేసిన యడ్యూరప్పపై వచ్చిన ఆరోపణలు, భాజపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గాలి జనర్ధానరెడ్డి, శ్రీరాములు తదితర మైనింగ్‌ మాఫియా నేతల వల్ల భాజపా తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. ఏడాది క్రితం జరిగిన కర్నాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకు పోయింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధరామయ్య చాణుక్యాన్ని భాజపా ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. ఇక, పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్‌ చెప్పగానే ఆయన పోటీ చేయటం ఖాయమని అభిమానులు అందరూ ఆశించారు.  ఆ మేరకు అయన అభిమాన సంఘాలన్నీ పార్టీ తరపున ప్రచారానికి ఉద్యుక్తులయ్యారు కూడా. అలాంటిది, ఆయన పోటీ చేయకుండా మరో పార్టీకి ప్రచారం నిమిత్తం బయలుదేరితే కేవలం ఒక సెలబ్రిటీ హోదాలోనే ప్రచారంచేస్తారు గానీ జనసేన అధ్యక్షునిగా ప్రచారం చేసే అవకాశంకోల్పోయారని అయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. అదే జనసేన పార్టీ తరపున ఆయన ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని, పార్టీ తరపున అభ్యర్ధులను పోటీకి దించటంతో పాటు ఆయన కూడా పోటీలో ఉండి, అపుడు ఆయన గనుక ప్రచారానికి బయలుదేరితే ఆ ఊపే వేరుగా ఉంటుందని ఆయన అభిమాన సంఘాల నేతలు అంటున్నారు. మరి, విశేష సంఖ్యలో అభిమానులు ఉన్న ఇటు తెలంగాణాలోనూ కాకుండా అటు సీమాంధ్రలోనూ గాక కర్నాటక  ప్రచారానికి వెళుతున్న పవన్‌ గాలి కర్నాటకలోని భారతీయ జనతా పార్టీ అభ్యర్ధుల విజయానికి ఎంత వరకూ ఉపయోగపడుతుందో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: