సినీ నటుడు బాలకృష్ణ తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి బీ ఫారం అందుకుంటున్న చిత్రం చూశారా? ఏమనిపించింది? చాలామందికి ఒకటే అనిపించింది. పార్టీకి వారసుడు అయిన బాలకృష్ణ పరాయి వ్యక్తి నుంచి బీ ఫారం అందుకోవాల్సిన దుస్థితి పట్టిందని భావించారు. నిజానికి, తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు. ఆ పార్టీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మార్చింది కూడా ఆయనే. దేశంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఎన్టీఆరే. తెలుగు వారికి గుర్తింపు తీసుకొచ్చిన ఎన్టీఆర్.. తెలుగు వారి పార్టీగా తెలుగుదేశాన్ని నిలిపారు. సాధారణంగా అయితే, ఎన్టీ రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీకి హరికృష్ణో బాలకృష్ణో వారసులు అవ్వాలి. ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షులుగా వారిద్దరిలో ఒకరు ఉండి ఉండాలి. ఒకవేళ సినిమాలో నష్టపోతామని వారు భావిస్తే ఏ పురందేశ్వరో ఉండి ఉండాలి. కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు నందమూరి వంశానికి చెందినవాడు కాకుండా నారా వంశానికి చెందిన చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పార్టీ పూర్తిగా నందమూరి వంశం చేతుల్లోంచి నారా వంశం చేతుల్లోకి వెళ్లిపోయింది. నందమూరి వంశానికి చెందిన వాళ్లు ఎవరైనా రాజకీయాల్లోకి రావాలన్నా.. ఎక్కడైనా ‘తమ పార్టీ’ తరఫున పోటీ చేయాలన్నా నారా వంశానికి చెందిన వాళ్లను టికెట్టో బీ ఫారమో అభ్యర్థించాల్సిందే. నారా వంశం దయతలిస్తే అభ్యర్థులు అవుతారు. లేకపోతే పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందే. ఇప్పుడు కూడా బాలకృష్ణ, హరికృష్ణ ఇద్దరూ టికెట్లు అడిగారు. బాలకృష్ణకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. హరికృష్ణకు మొండిచేయి చూపారు. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితి నందమూరి వంశస్తుల స్వయం కృతాపరాథమే. తండ్రికి వెన్నుపోటు పొడిచిన ఘన కార్యంలో వాళ్లు కూడా భాగస్వాములు కనకనే తండ్రి వారసత్వం అయిన పార్టీ వాళ్లకు దక్కకుండాపోయింది. టికెట్టు కావాలన్నా వేరే వాళ్లను దేబిరించాల్సిన పరిస్థితి నెలకొంది. నిజం చెప్పాలంటే, ఎన్టీ రామారావు చివరి రోజుల్లో నందమూరి కుటుంబానికి చెందిన వాళ్లు ఎవరూ ఆయనను పట్టించుకోలేదు. ఆయన బాగోగులు చూడలేదు. ఆయనకు కనీసం జ్వరం వచ్చినా పట్టించుకునే నాథుడు లేడు. ఆ పరిస్థితుల్లోనే ఆయన లక్ష్మీపార్వతికి దగ్గర అయ్యారు. తనకు ఒక తోడు కావాలని ఆమెను పెళ్లి చేసుకున్నారు. వృద్ధాప్యంలో తండ్రి బాగోగులను చక్కగా చూసుకుంటే ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతికి దగ్గరయ్యే వారు కాదు కదా. ఇక, రెండోది. లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీ రామారావును వ్యతిరేకించడం. తండ్రి తాను తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కిపోడని, ఎవరు చెప్పినా వినని సీతయ్య అని కొడుకులకు ముందే తెలిసి ఉండాలి. ఒత్తడి చేస్తే మరింత మొండికేసే వ్యక్తని అర్థమై ఉండాలి. అలా కాకుండా, కొంతమంది మీడియా వ్యక్తుల చేతుల్లో పావులుగా మారిన నందమూరి కుటుంబ సభ్యులు కూడా లక్ష్మీ పార్వతి పార్టీని ఎగరేసుకుపోతుందేమోనని అప్పుడు ఆందోళన పడ్డారు. వాళ్ల కుట్రల్లో భాగస్వాములు అయ్యారు. తండ్రి బాగోగులు చూడకపోవడమే కాదు ఆయనను క్షోభ పెట్టడంలో ముందున్నారు. ఎన్టీ రామారావును అధికారం నుంచి దించేయడమే కాదు.. ఆయనపై చెప్పులు విసిరి అవమానానికి గురి చేయడంలోనూ.. ఆ తర్వాత ఆయన చనిపోవడంలోనూ పరోక్షంగా భాగస్వామ్యం పంచుకున్నారు. ఒకవేళ, అప్పట్లో ఎన్టీ రామారావు బాగోగులను ఆయన కుటుంబ సభ్యులు పట్టించుకుని ఉంటే.. ఎన్టీఆర్ ను దింపేసే కుట్రలో బాలకృష్ణ, హరికృష్ణ, పురందేశ్వరి భాగస్వాములు కాకుండా ఉండి ఉంటే ఇప్పుడు తెలుగుదేశం వారి చేతుల్లో ఉండి ఉండేది. టికెట్ల ఎంపిక నుంచి పార్టీ వ్యవహారాలన్నీ వారి కనుసన్నల్లో ఉండి ఉండేవి. పురందేశ్వరి కాంగ్రెస్ కు అక్కడి నుంచి బీజేపీకి అక్కడి నుంచి మరో చోటకు మారాల్సిన దుస్థితి ఆమెకు ఉండేది కాదు. నాకు ఒక టికెట్ ఇవ్వు అని బావను హరికృష్ణ అడగాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు. హిందూపురం నుంచి పోటీ చేయడానికి బాలకృష్ణ చంద్రబాబు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. భవిష్యత్తులో నందమూరి వారసులు రాజకీయాల్లోకి రావడానికి నారా కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన దుస్థితి ఎదురయ్యే అవకాశం ఉండదు. నిజానికి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని చంద్రబాబుపై డిమాండ్లు వచ్చాయి. అప్పుడు తెలంగాణలో పుట్టిన బాలకృష్ణను ఆ శాఖకు అధ్యక్షుడిని చేసి ఉండవచ్చు. అప్పుడు బాలకృష్ణ క్రేజ్ తోపాటు పార్టీ కేడర్ బలంతో ఆ ప్రాంతంలో టీడీపీ దూసుకుపోయి ఉండి ఉండేది. కానీ, బాలకృష్ణకు పార్టీ పగ్గాలు ఇస్తే, రెండు ప్రాంతాల్లోనూ అది తన కుటుంబం చేయి జారిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు అంచనా వేశారు. పార్టీని మళ్లీ నందమూరి కుటుంబం చేతుల్లో పడితే భవిష్యత్తులో తన వారసుల పరిస్థితి కూడా ఇప్పుడు నందమూరి వారసుల పరిస్థితి అవుతుందని ముందే ఊహించారు. అందుకే, అక్కడ తెలివిగా బాలకృష్ణను పెట్టకుండా బీసీ కార్డును తెరపైకి తెచ్చారు. పార్టీకి తాము వారసులం అయి ఉండి కూడా రెండు టికెట్ల కోసం బాలకృష్ణ, హరికృష్ణ చంద్రబాబు ఇంటికి వచ్చి బతిమలాడుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. అంతేనా.. పురందేశ్వరికి ఎక్కడా టికెట్ దక్కకుండా చేయడంలోనూ చంద్రబాబు పావులు కదుపుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారిన పురందేశ్వరి ఎక్కడెక్కడి నుంచి టికెట్ ఆశిస్తే ఆ స్థానాన్ని వివాదాస్పదం చేయడం లేదా అక్కడ తన అభ్యర్థిని నిలబెట్టడం చేస్తున్నారు చంద్రబాబు. పురందేశ్వరి విశాఖ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఇప్పటికే రంగంలో ఉన్నారు. పురందేశ్వరి విజయవాడ టికెట్ ఆశిస్తున్నారు. ఆ సీటును నాని, పొట్లూరి వరప్రసాద్ మధ్య వివాదంగా మార్చి.. తప్పనిసరి పరిస్థితుల్లో నానికి ఇచ్చినట్లు పావులు కదిపారు. పురందేశ్వరి ఒంగోలు సీటు ఆశిస్తున్నారు. అక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రకటిస్తున్నారు. బీజేపీకి వెళ్లినా పురందేశ్వరికి రాష్ట్రంలో ఎక్కడి నుంచీ టికెట్ దక్కకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యమని అంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడం లేదు కనక హరికృష్ణకు టికెట్ లేదు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఎలాగూ ముగిసిపోయింది కనక బాలకృష్ణకు మాత్రం ఓ ఎమ్మెల్యే టికెట్ పారేశారు. పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు నందమూరి కుటుంబానికి ఒకటో అరో టికెట్లు పారేస్తున్నారు. పార్టీ తమ తండ్రిదే అయినా నందమూరి వారసులు మాత్రం తమకు ఒక టికెట్ ఇవ్వండి అంటూ చంద్రబాబును దేబిరిస్తున్నారు. ఇదే విచిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: