ఆయన ట్రెండ్ ఫాలో అవడు.. సెట్ చేస్తాడు. టైమ్ ను నమ్మడు.. టైమింగ్ ను మాత్రమే నమ్ముతానంటాడు. తిక్కుందంటాడు.. దాని లెక్క తన దగ్గరుందంటాడు. అనూహ్యంగా అభిమానులున్నారు. ఆయనతో పాటే ఆవేశంగా నడుస్తామంటారు. కానీ లేటెస్ట్ 'జనసేనా'ధిపతి పాత్ర ఎవరికీ అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో.. ఆయన అసలు స్వరూపం ఏంటో ఇప్పుడిప్పుడే కాస్తోకూస్తో అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు. రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ తెగ బిల్డప్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు రంగు బయటపడిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. పొలిటికల్ ఎంట్రీ సందర్భంగా ఆవేశంగా ప్రసంగించిన పవన్... ఇజం పేరుతో ఏకంగా పుస్తకాన్ని ముద్రించి సమాజాన్ని సంస్కరించేందుకు సిద్ధమన్నారు. పవన్ సోదరుడు చిరంజీవితో పాటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ వంటి ప్రముఖులంతా ఇజం పుస్తకాన్ని చదవి అర్ధంకాక జుట్టుపీక్కున్నారు. ఇంతకీ పవన్ ఈ ఇజం పుస్తకం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వలనుకున్నారో వారికి క్లారిటీ రాలేదు. ఇలా కన్ఫ్యూజన్ లో పడ్డ వారికి తన ఇజంపై స్పష్టత ఇచ్చేందుకు పవన్ సిద్ధమయ్యారు. తనకు గిట్టని వారంతా దుష్టులు, దుర్మార్గులు.. వారిని రాజకీయాలనుంచే కాదు, దేశం నుంచే తరిమికొట్టాలి. దేశం నుంచి తరమికొట్టాల్సిన పార్టీకి తన సోదరుడు చిరంజీవి నేతృత్వం వహిస్తారు. కానీ అన్నయ్య పేరును నామమాత్రంగానైనా ప్రస్తావించరు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తప్పు కూడా ఎమ్మెల్యేలదే అంటారు కానీ చిరంజీవికి ఏ పాపం తెలియదని వెనకేసుకొచ్చే పవన్ తన ఇజం పుస్తకాన్ని కూడా ఇలాంటి పక్షపాత ధోరణితో రాయడం వల్లే దానిపై ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. పవర్ స్టార్ ఆలోచనా ధోరణిని అర్ధం చేసుకుని చదివితే ఇజం పుస్తకం అర్ధమవుతుంది. ఇంతకీ పవనిజం అంటే ఏమిటంటే తన సన్నిహితుడు పొట్లూరి వర ప్రసాద్ కి తన ఇమేజ్ ని ఉపయోగించి ఎంపీ టిక్కెట్ ఇప్పించడం. ఈ ప్రయత్నంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడికి మద్దతు తెలపడం. ఇంకా అవసరమైతే గతంలో తాను అవినీతి ఆరోపణలు చేసిన చంద్రబాబునాయుడ్ని కూడా వెనకేసుకురావడం. ఇంత మహోన్నత ఉద్దేశంతో రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ లక్ష్యాన్ని అర్ధం చేసుకోక నోటికొచ్చినట్లు మాట్లాడితే.. అసలే ఆయనకు తిక్కతో పాటూ, దానికో లెక్క కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. పవన్ కళ్యాణ్ కి తిక్క ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన పొట్లూరి వరప్రసాద్ కి ఎంపీ టిక్కెట్ ఇప్పించేందుకు పైరవీ చేస్తున్నప్పుడే ఈ విషయం అర్ధమైందని పవర్ స్టార్ ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన కామెంట్స్ వారి వాదనను బలపరచే విధంగా ఉన్నాయి. రాజకీయాల్లో అవినీతిని మరక పడిన వారిని దరి చేరనివ్వొద్దని చెప్పిన పవన్ ఇప్పుడు పొట్లూరి వరప్రసాద్ విషయంలో మాట మార్చారు. అవినీతి కేసుల్లో వరప్రసాద్ కి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ఆయన ఎన్నికల్లో పోటీ చేయడంలో తప్పులేదని పవన్ కళ్యాణ్ కొత్త వాదనకు తెరలేపారు. మరి జగన్ అవినీతిలో పొట్లూరి పాలుపంచుకున్నారా లేదా అనే విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వడంలేదు. తప్పు చేసి ఉండొచ్చు కానీ అది రుజువు కాలేదు కదా అనే రీతిలో పవన్ వితండ వాదం చేస్తూ పీవీపీని వెనకేసుకురావడాన్ని చూసి ఆయన ఎంత గొప్ప ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో అర్ధమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఓ అడుగు ముందుకేసి అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన వాళ్లే ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు, పొట్లూరి వరప్రసాద్ కి టిక్కెట్ ఇస్తే తప్పంటని పవన్ కళ్యాణ్ వింత వాదనతో మరో కన్ఫ్యూజన్ కి తెరలేపారు. తెలుగుదేశం టికెట్ల విషయంలో తాను కలగజేసుకోనని చెప్పుకొచ్చారు. పొట్లూరి వరప్రసాద్ చాలా మంచి వ్యక్తి అని.. అతనికి సీబీఐ క్లీన్ చిట్ కూడా ఇచ్చిందని అన్నారు. జైలు నుంచి వచ్చిన వారే ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు పొట్లూరి పోటీ చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు. అయితే ఇదే సమయంలో గత ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పేరుతో అరాచకం చేస్తే, ఈసారి పవన్ కళ్యాణ్ అన్నయ్యను తలదన్నే రీతిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారని ప్రత్యర్ధులు ఎదురుదాడి మొదలుపెట్టారు. మరి పవన్ తన తిక్కకు కొత్త లెక్క ఎలా చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: