నామినేషన్ల ఘట్టంలో ఇప్పటికే మూడు రోజులు పూర్తికావస్తున్నప్పటికీ బుధవారం రాత్రి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలో పూర్తిస్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసుకోలేక సతమతవౌతోంది. ప్రధానంగా విజయవాడ తూర్పు, నూజివీడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఉత్కంఠత కొనసాగుతోంది. తూర్పు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా సీటును ఆశిస్తూ వస్తున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వం ఖరారు విషయంలో చంద్రబాబు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యలమంచిలి రవి పేరుతో పాటు తన బావమరిది, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అభ్యర్థిత్వాన్ని కూడా బాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ హిందూపురం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. హరికృష్ణకు కూడా సీటు ఖరారయితే విమర్శలకు గురికావలసి వస్తుందనే భయం బాబును వెంటాడుతోంది. దీంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయినప్పటికీ గద్దె రామ్మోహన్ దంపతులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలావుంటే గద్దెకు సీటు ఖరారులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ వందలాది మంది కార్యకర్తలు తూర్పు తెలుగుదేశం కార్యాలయం వద్ద మధ్యాహ్నం నుంచి ఆందోళన చేస్తున్నారు. ఒకదశలో కొందరు ఆత్మాహుతి యత్నం చేయగా నాయకులు అడ్డుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: