తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి కూడా కచ్చితమైన మెజారిటీ లభించే అవకాశాలు లేవని స్పష్టం చేస్తున్నాయి వివిధ సర్వేలు. పార్టీలు అంతర్గతంగా చేయించుకొన్న సర్వేల సారాంశం కూడా అదే విధంగా ఉందని తెలుస్తోంది. ఏ రాజకీయ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండకపోవచ్చని... ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతోందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కోసం జరుగుతున్న తొట్టతొలి ఎన్నికల్లో తెరాసకు గరిష్టంగా 42 ఎమ్మెల్యే స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. మొత్తం 119 అసెంబ్లీ సీట్లు న్న ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ సత్తా 42 కి పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. దీన్ని బట్టి ప్రభుత్వ ఏర్పాటు కు తెరాస ఆమడదూరంలో ఆగిపోయే అవకాశాలున్నాయని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి కన్నా ఉత్తమస్థాయిలోనే సీట్లు వస్తాయని ఎమ్ఐఎమ్ మద్దతుతో కలిసి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఎన్నికల ముందు టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరిని చూస్తుంటే భవిష్యత్తులో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంలో ని సీమాంధ్రులను తరిమి కొట్టాలన్నట్టుగా మాట్లాడుతోంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్ లు ఇప్పుడు హార్డ్ కోర్ తెలంగాణ అభిమానుల ఓట్లను మాత్రమే లక్ష్యంగా చేసుకొన్నట్టు తెలుస్తోంది. వారి ఓట్లు వస్తే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే ప్రతిపక్ష స్థానంలో కూర్చొని విధ్వేష రాజకీయాలను చేయడానికి అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విభజన తర్వాత కూడా సీమాంధ్రులను తిడుతూ, సెటిలర్లపై విరుచుకుపడుతూ టీఆర్ఎస్ వాళ్లు తమ ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: