టీడీపీ బీజేపీల మధ్య పొత్తు ఓ ప్రసహనంగా మారింది. మొన్నటిదాకా సీట్ల సర్దుబాటులో ఎంతకీ తెగని మంతనాలు చేసిన ఇరుపార్టీల నేతలు.. ఇప్పుడు కాపురాన్ని మూడునాళ్ల ముచ్చట చేసుకోబోతున్నారు. మొదటి నుంచీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తును అధినాయకత్వాలు తప్ప... ద్వితీయశ్రేణి నాయకలుగానీ, కార్యకర్తలు గానీ హర్షించింది లేదు. అయినా రెండు గడ్డాలు కలిస్తే.. ఇంకేం అడ్డం ఉండదన్న ఫీలింగ్తో మోడీ, బాబు ఏకమయ్యారు. కానీ, అంతర్గత కలహాలు, కుమ్ములాటలతో రోజురోజుకూ చప్పబడుతూ వచ్చిన వ్యవహారం అప్పుడే విడాకుల దాకా దారితీసింది. బీజేపీ టీడీపీలది హిట్పెయిర్అన్న టాక్తో మాంచి ఊపుమీద ఉన్న నేతలు.. పొత్తు పొడుపు ఉభయతారకమే అనుకున్నారు. తెలంగాణాలో నెమ్మదించిన తెలుగుదేశానికి, సీమాంధ్రలో పెద్దగా ఓట్లు రాలని బీజేపీకి బాగా కలిసొస్తుపందని ఊహించుకున్నారు. కానీ, అప్పుడే సీన్సితారైంది. అయితే, తెలుగుదేశం లేకుండా బీజేపీ రాణించగలగుతుందా అనే అనుమానం కలుగుతోంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వైభవం మొన్నటి వరకూ ఒకేఒక్కసీటు. కానీ, విభజన పుణ్యమా అని కిషన్రెడ్డి కొంత ఉత్సాహం వచ్చింది. ఇక.. ఆ పార్టీకి 2014 ఎన్నికలకు గాను ఉన్న ఏకైక క్యాంపైనర్, చరిష్మా ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ ఒక్కడే. కానీ, టీడీపీతో జత లేకుండా మోడీ ఒక్కడి వల్ల బీజేపీ బలపడుతుందా? అంటే అనుమానమే. ఎందుకంటే ఉత్తర భారతంలో ఉన్న గాలి దక్షిణాన ఎప్పుడూ ఉండదు. ఒకవేళ ఉన్నా.. కాంగ్రెస్తప్ప ఆల్టర్నేట్లేని జాతీయ పార్టీగా భావించి కాస్తోకూస్తో లోక్సభ సీట్లు గెలవొచ్చు. కానీ, అసెంబ్లీ స్థానాల విషయంలో మాత్రం ఒంటరిగా ఉంటే బీజేపీ సీట్లు సాధించలేదనేది నిర్వివాదాంశం. ఇలాంటి అత్యవసర సమయంలో పొత్తు చెడితే.. అది మీవల్లంటే కాదు.. మీ వల్లే అంటూ నిందలు మోపుకోడానికి ఇరుపార్టీల నేతలు ఇప్పటి నుంచే ట్రయల్స్మొదలుపెట్టారు. మాటల యుద్ధంలో మునిగితేలుతున్నారు. కలిసున్న నాలుగురోజులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇరు పార్టీల నేతలు... ఇప్పుడు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ముందైతే నామినేషన్లు కానివ్వండి.. తర్వాత మాట్లాడదాం అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటివారితో ఇప్పటికే నామినేషన్లు వేయించిన చంద్రబాబు మైండ్గేమ్ను రాష్ట్ర బీజేపీ ఎదుర్కోలేకపోయింది. అందుకే జాతీయ స్థాయి నాయకత్వాన్ని బరిలోకి దింపింది. బాబు మైండ్గేమ్కు దీటైన ఆట ఆడాలనుకుంటోంది. అందుకు బాగా ఆలోచించి... పొత్తు తెగిపోతే పీవీపీని అక్కున చేర్చుకుని, విజయవాడ బరిలో తమ తరుపున దింపుతామని బెదిరిస్తోంది. కానీ, హనుమంతుడి ముందు కుప్పిగంతులన్నట్లు... బీజేపీ ఆ నిర్ణయం తీసుకుంటే టీడీపీ నరసాపురం టికెట్ను తమ తరఫున రఘురామకృష్ణంరాజుకు ఇవ్వాలని డిసైడైంది. దీంతో.. సీతయ్య హరికృష్ణను హిందూపురం బరిలో బాలకృష్ణకు వ్యతిరేకంగా దింపుతామని బీజేపీ ప్రకటించి మరో తప్పు చేసింది. దీనికి ఏకంగా హరికృష్ణే స్పందించారు. తనకు తెలియకుండా తన పేరు వాడుకుంటున్నందుకు బీజేపీని నానాతిట్లూ అందుకున్నారు. మరోవైపు టీడీపీతో అధికారిక సంబంధం పెట్టుకున్న బీజేపీ.. ఇటు వైసీపీ అధినేత జగన్కూ కన్నుగీటుతోంది. మోడీ సన్నిహితుడు అదానీ ఇప్పటికే జగన్ను కలిసినట్లు సమాచారం. ఈ డబుల్గేమ్ను గమనించిన టీడీపీ నేతలు... అసలు బీజేపీ బలంమెంత? పొత్తు అవసరమా? అంటూ అధినేతకు మరోసారి నూరిపోస్తున్నారు. ఏపీలో రెండుమూడు శాతానికి మించని ఓట్లన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని కచ్చితంగా నష్టపోయే కంటే, ఒంటరిగానే చావోరేవో తేల్చుకుందామనుకుంటున్నారు తెలుగుదేశం నేతలు. ప్రస్తుతానికి పెద్దల మధ్యకు వెళ్లిన ఈ వ్యవహారం తెగిపోతే బావుండని కొందరు టీడీపీ నేతలు, తెలంగాణాలో ఎలాగూ బాబు గేమ్కు బలయ్యాం కాబట్టి బలవంతంగానైనా పొత్తు కొనసాగించాలని బీజేపీ నేతలు మరికొందరు ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: