విశాఖపట్టణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను రంగంలోకి దించింది. చిత్రంగా భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు కూడా ఇక్కడి నుంచే పోటీ పడుతున్నారు. అసలు విజయమ్మ లోక్ సభ కు పోటీ చేయడానికి సుదూరమైన కడప నుంచి ఇంతవరకు రావడం ఎందుకన్నది ముందు చూడాలి. వాస్తవానికి జగన్ కడప ఎంపీ. వైఎస్ మరణించిన తరువాత పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా విజయమ్మ ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో సిఎమ్ కావాలని జగన్ ఆశిస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యేకు పోటీ పడాలి కనుక, పులివెందులను తను తీసుకున్నాడు. విజయమ్మను తన సీటైన కడప కు పంపేయచ్చు. కానీ అక్కడ ఎప్పటి నుంచో వైఎస్ అవినాష్ కు మాట ఇచ్చాడు. అందుకే స్వంత సోదరి షర్మిల అడిగినా నో అన్నాడు. నిజానికి ఈ సీటు వీరెవరిదీ కాదు. బాబాయ్ వివేకానంద రెడ్డిది. అయితే విజయమ్మ ఈ సారి పోటీ చేస్తారని ముందుగా ఎవరూ భావించలేదు. కానీ పరిస్థితులు అలా తోసుకువచ్చాయి. ఇందుకు కీలక కారణాలు రెండు. ఒకటి, పార్టీ తరపున లోక్ సభలో ఓ నాయకుడు అంటూ స్వంత మనిషి వుండాలి. అది ఎవరు అన్నది ఒక మాట. రెండవది ఇటీవల గడచిన రెండు నెలలుగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కాస్త పట్టు పెంచుకుంది. అందుకోసం గడచిన నెల రోజులుగా జగన్ ఇటే కన్నేసి వుంచారు. అక్కడే మరి కొంచెం ముందుకు వెళ్లి వైకాపా పెద్ద తలకాయలు ఎవరైనా ఉత్తర కోస్తా నుంచి పోటీ చేస్తే పార్టీకి ఊపు వస్తుందని భావించారు. అందుకే వైవి సుబ్బారెడ్డిని విశాఖ వెళ్లమన్నారు. దానికి ఆయన ససేమిరా అన్నారు. దాంతో ఇక మిగిలిన ఆప్షన్లు రెండు. ఒకటి షర్మిల, రెండు జగన్. తూర్పుగోదావరి నుంచి కూడా పోటీ చేస్తే ఎలా వుంటుందని జగన్ యోచించినా, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేసే ప్రమాదం వుందని విరమించుకున్నారు. ఇలాంటి సమయంలో షర్మిల విశాఖపై ఆసక్తి చూపారు. ముందు జగన్ కాస్త మొగ్గు చూపినా, రెండు పవర్ సెంటర్లు ఏర్పడే ప్రమాదం వుందని షర్మిలను వెనక్కు తీసి, విజయమ్మను పంపారు. . ఇంతవరకు బాగానే వుంది. కానీ విజయమ్మ చరిష్మా ఏ మేరకు అన్నది సమస్య. హరిబాబు కూడా స్థానికుడు కాకున్నా, గడచిన ఇరవై ఏళ్లుగా ఆయన ఇక్కడే వుండడం, ఓ దఫా ఎమ్మెల్యేగా చేయడం కాస్త ప్లస్ అయింది. నిజానికి విజయమ్మ కన్నా షర్మిల అయితే కాస్త చరిష్మా వుండి వుండేది. పైగా పాదయాత్ర సమయం నుంచే షర్మిలను విశాఖనుంచి పోటీకి దించుతారన్న ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా విజయమ్మను విశాఖనుంచి పోటీ చేయించడంలో జగన్ ఆంతర్యమేమిటో కూడా వైకాపా శ్రేణులకే అర్థం కావడం లేదు. ప్రస్తుత ఎన్నికలను కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు సవాలుగా తీసుకుంటున్నాయి. అలాంటి సమయంలో విశాఖ రెడ్డి, కమ్మ వర్గాల బల పరీక్షకు వేదికగా మారింది. ఇలాంటి అవకాశాన్ని కమ్మ వర్గాలు తేలికగా తీసుకొవు. అయితే వైకాపా ధీమా వేరుగా వుంది. మైనారిటీ ఓట్లు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలో కాస్త గట్టిగానే వున్నాయి. వాటి అండపై వైకాపాకు భరోసా వున్నట్లుంది. అది కొంత వరకు ప్లస్ కావచ్చు. కానీ గంటా శ్రీనివాసరావు వర్గం తెలుగుదేశంలో వుంది. ఆ వర్గం కనుక సిన్సియర్ గా పని చేస్తే, భాజపాకు ప్లస్ అవుతుంది. పైగా భాజపాకు విశాఖలో కాస్తో కూస్తో సంస్థాగత బలం కూడా వుంది. విశాఖ తొలి మేయర్ భాజపా వ్యక్తి. ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ జనాలు ఇక్కడ బాగానే వున్నారు. ఇటు గంటా తదితరుల వల్ల వచ్చే సామాజిక వర్గ ఓట్ల నష్టం. అటు ఆరెస్సెస్ వంటి సంస్థల బలం, ఇవన్నీ భాజపా అభ్యర్థికి బలంగామారుతాయి. వైకాపా కేవలం కొణతాల రామకృష్ణ, దాడివీరభద్రరావు వంటి పక్క నియోజకవర్గ నేతలపై ఆధారపడాల్సి వుంది. ఈ నేపథ్యంలో విజయమ్మ విజయానికి అవకాశాలు ఏ మేరకు అన్నది వేచి చూడాల్సి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: