వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు వెన్నుపోటు పొడవటం చంద్రబాబుకు కొత్తేమి కాదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కడప జిల్లాలోని రైల్వే కోడూరులో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబులా నీతి నిజాయితీలు లేని రాజకీయాలు తాను చేయలేనని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. హామీలిచ్చి మోసగించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుసా అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. తనకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి విశ్వసనీయతే వారసత్వంగా వచ్చిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రను ఐదు సంతకాలతో మారుస్తానని చెప్పారు. అక్కా చెల్లెమ్మల కోసం అమ్మఒడి పథకంపై తొలి సంతకం చేయనున్నట్లు జగన్ తెలిపారు. అవ్వా తాతల కోసం రెండో సంతకం చేస్తానని రూ. 200 నుంచి రూ. 700 పింఛన్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రైతుల కోసం మూడో సంతకం చేస్తానని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం రూ. 3వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 20 రోజుల్లో సువర్ణయుగం రానుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: