రెండవ విడత ఎన్నికలు జరుగనున్న ఆంధ్రప్రదేశ్‌(సీమాంధ్ర)రాష్ట్రంలో తెలుగు దేశంపార్టీలోని అసంతృప్తులు సహకరించే అవకాశాలపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా ఇతర పార్టీల్లో ఉన్నట్లుగా టీడీపీలో అసంతృప్తి త్వరగా బయటపడదు. ఇప్పటి వరకూ జరిగిన పలు ఎన్నికల్లో ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. అయితే ఈ సారి మాత్రం వివిధ జిల్లాల్లోని పలువురు నేతలు తమ అసంతృప్తిని బాహటంగానే వెలిబుచ్చటం గమనార్హం. అంటే ఒకరకంగా కాంగ్రెస్‌ పార్టీలో మాత్రమే చూడ గలిగిన అంతర్గత ప్రజాస్వామ్యం ఈ సారి తెలుగుదేశంలో కూడా ఆవిష్కృతమైంది.రాష్ర్ట విభజన నేపధ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుండి పోటీ చేసే అవకాశం లేని పలువురు మాజీ మంత్రలు, సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలతో కలిపి పలువురు నేతలు సుమారుగా 45 మంది ఈసారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరందిరకీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్ల హామీలిచ్చి తమ పార్టీ కండువాలను కప్పారు. సీమాంధ్రలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో టిక్కెట్లపై హామీతో పలువురు కాంగ్రెస్‌ వారు చేరారు. అయితే, టిక్కెట్ల పంపిణీ వద్దకు వచ్చే సరికి చంద్రబాబు కాంగ్రెస్‌ నుండి వచ్చిన అందరికీ టిక్కెట్లను ఇవ్వలేక పోయారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్‌ నుండి వచ్చిన వారిలో అసెంబ్లీ, పార్లమెంట్‌ కలిపి చంద్రబాబు 35 మందికి టిక్కెట్లను ఇవ్వగలిగారు. అంటే ఆ మేరకు పార్టీలో గడచిన పది ఏళ్లుగా కష్టపడిన వారికి టిక్కెట్లు లభించలేదు. వీరంతా చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే, పార్టీలోనే ఉన్న మరో పది మంది సిట్టింగ్‌ శాసనసభ్యులకు తిరిగి టిక్కెట్లు ఇవ్వటినికి చంద్రబాబు నిరాకరించటంతో నేతల్లోని అసంతృప్తి తారాస్ధాయికి చేరకుంది. దీని ప్రభావం అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు సమయంలో బయటపడింది. ప్రస్తుతం టీడీపీ మూడు రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. ఒకటి పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి 14 శాసనసభా టిక్కెట్లను కేటాయించటమే ఇష్టం లేని నేతలు, కాంగ్రెస్‌ వలస పక్షుల వల్ల తమ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన వారికి తోడు తిరిగి పోటీ చేసే అవకాశాన్ని కోల్సోయిన మ రో 10 సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలు తోడయ్యారు. దీంతో సుమారు 30 నియోజకవర్గాల్లో పార్టీ అధికారిక అభ్యర్ధులకు తోడు తిరుగుబాటు అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ తిరుగుబాటు అభ్యర్ధులను బుజ్జగించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్నట్లు కనబటం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి.అనంతపురం లోక్‌సభ, తాడిపత్రి శాసనసభకు కాంగ్రెస్‌ వలసపక్షులైన జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిలకు టిక్కెట్లు లభించాయి. అదే జిల్లాలోని హిందుపురం శాసనసభకు సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ అబ్దుల్‌ఘనిని కాదని తన బావమరిది నందమూరి బాలకృష్ణకు చంద్రబాబు టిక్కెట్టు కేటాయించారు. రాయదుర్గంలో స్దానిక అభ్యర్ది దీపక్‌రెడ్డిని కాదని మాజీ ఎంపి కాల్వ శ్రీనివాసులుకు టిక్కెట్లు ఇచ్చారు. కర్నూల్‌ జిల్లాలో సీనియర్‌ నేత కెయూ ప్రభాకర్‌కు టిక్కెట్టు ఇవ్వక కొత్త ముఖం బీటీ నాయుడుకు టిక్కెట్టు ఇవ్వటంతో ప్రభాకర్‌ కర్నూల్‌ లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్దిగా నామినేషన్‌ దాఖలు చేశారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ ఎం. లింగారెడ్డిని కాదని వరదƒ రాజులరెడ్డికి టిక్కెట్టు ఇవ్వటంతో లింగారెడ్డి కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ హేమలతకు టిక్కెట్టు నిరాకరించి కొత్త వ్యక్తికి ఇవ్వటంతో ఆమె తిరుగుబాటు అభ్యర్దిగా నామినేషన్‌ దాఖలు చేశారు.నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ బల్లి దుర్గాప్రసాద్‌రావుకు టిక్కెట్‌ నిరాకరించటంతో ఆయన పోటీ అభ్యర్దిగా నామినేషన్‌ వేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుండి వచ్చిన శాసనసభ్యుడు అన్నె రాంబాబుకు టిక్కెట్టు ఇవ్వటంతో పార్టీలో టిక్కెట్లు ఆశించిన నేతలు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక, కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ దాసరి బాలవర్ధనరావును కాదని అవనిగడ్డకు చెందిన వల్లభనేని వంశీకి టిక్కెట్టు ఇవ్వటంతో దాసరి పోటీ అభ్యర్దిగా నిలిచారు. అవనిగడ్దలో పోటీ చేసే అవకాశం కాంగ్రెస్‌ నుండి వచ్చిన మండలి బుద్దప్రసాద్‌కు ఇచ్చారు. దాంతో ఆ నియోజకవర్గంలోని పార్టీ నేతలెవరూ మండలికి సహకరించటం లేదు.గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో పార్టీలో ఎప్పటి నుండో కష్టపడుతున్న నేతను కాదని స్ధానికేతరుడైన తులసీ రామచంద్రప్రభుకు టిక్కుట్టు ఇచ్చారు. దాంతో నియోజకవర్గం వ్యాప్తంగా అసంతృప్తి సెగలు లేవగా వెంటనే రామచంద్రప్రభుకు టిక్కెట్టు రద్దు చేశారు. అయితే, ఎప్పటి నుండో కష్ట పడుతున్న నేతకు కాదని చిరంజీవి అనే వ్యక్తికి టిక్కెట్టు కేటాయించటంతో అభ్యర్దిని గదిలోపెట్టి తాళం వేశారు. చివరి నిముషంలో పోలీసుల జోక్యంతో అభ్యర్ది నామినేషన్‌ వేయగలిగారు. గోదావరి జిల్లాలోని కొవ్వూరు సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ టి.వి.రామారావును కాదని కొత్త వ్యక్తికి టిక్కెట్టు ఇవ్వగా రామారావు తిరుగుబాటు అభ్యర్దిగా పోటీలో ఉన్నారు. ఏ రకంగా చూసినా ఈ ఎన్నిక అటు చంద్రబాబుకు వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగా తెలుగుదేశంకు కూడా ఎంతో కీలకం. అటువంటిది టీడీపీ పోటీ చేస్తున్న 162 నియోజకవర్గాల్లో సుమారు30 నియోజకవర్గాల్లో అసంతృప్తుల సమస్య చాలా తీవ్రంగా ఉందని పార్టీ నేతలే అంటున్నారు. కీలకమైన ఈ ఎన్నికలో తమ అధ్యక్షుడు టిక్కెట్ల కేటాయింపులో ఇన్ని పొరబాట్లు ఎలా చేశాడో అర్ధం కావటం లేదని పార్టీ సీనియర్‌ నేతలే వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: