ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షమని అంటూ ఉంటారు. ఆముదం చెట్టు నాలుగైదు అడుగులకు మించి పెరగదు. దానిచుట్టూ ఉన్నవన్నీ చిన్ని చిన్ని మొక్కలే ఉంటాయి. వాటితో పోలిస్తే ఆముదం మొక్క చెట్టు కింద.. మహా వృక్షం కిందే లెక్క కదా. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. తెలంగాణ అంతటా ఆ పార్టీని ముందుకు నడిపించే ఒక నాయకుడు లేడు. ఆ ప్రాంతంలోని కాంగ్రెస్ నాయకులంతా ఆధారపడే ఒక నాయకుడు లేడు. తన గెలుపు సంగతి వదిలేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించే నాయకుడు లేడు. ఇది తెలంగాణ కాంగ్రెస్ దుస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబును తీసుకుందాం. కుప్పంలో నామినేషన్ వేయడానికి అసలు అక్కడికి వెళ్లనే లేదు. ఇప్పుడే కాదు గత ఎన్నికల్లోనూ ఆయన కుప్పం వెళ్లలేదు. అయినా అక్కడ ఆయన గెలుస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన నాయకులను గెలిపిస్తూ ఉన్నారు. తన నియోజకవర్గాన్ని వదిలేసి ఆయన రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉంటారు. వైసీపీ అధినేత జగన్మోమన్ రెడ్డినే తీసుకుందాం. పులివెందులలో ఆయన నామినేషన్ వేశారు. ప్రచారం ప్రారంభించి ఆ రోజు ఒక్కరోజూ అక్కడ ప్రచారం నిర్వహించారంతే. ఆ తర్వాత ఆయన పులివెందుల వెళ్లలేదు. రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రచారం చేస్తున్నారు. పోనీ, పులివెందులలో జగన్ తరఫున, కుప్పంలో చంద్రబాబు తరఫున మరెవరైనా ప్రచారం చేస్తున్నారా అంటే అదీ లేదు. ఇందుకు కారణం కుప్పం, పులివెందులలు వారికి కంచుకోటలు కనక. చంద్రబాబు, జగన్ తరహాలోనే తెలంగాణలో కేసీఆర్ కూడా తన సొంత నియోజకవర్గాలు వదిలేసి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధిష్ఠానం దామోదర రాజనరసింహను నియమించింది. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనని కూడా సంకేతాలు ఇచ్చింది. కాబోయే ముఖ్యమంత్రి అయినా, ప్రచార కమిటీ అధ్యక్షుడు అయినా అంటే అర్థం ఏమిటి? ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయడం. కానీ, దామోదర రాజనరసింహ పరిస్థితి ఏమిటో తెలుసా? సొంత నియోజకవర్గం ఆందోల్ లోనే ఆయన ఎదురీదుతున్నారు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఆయన తన నియోజక వర్గం దాటి బయటకు రావడం లేదు. ఏదో అక్కడక్కడా ప్రచారం చేస్తున్నా తెలంగాణలో పార్టీ గెలుపు బాధ్యతలను ఆయన తీసుకోవడం లేదు. ఆందోల్ లో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాబూ మోహన్ దాదాపు 2000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. సెంటిమెంటు ఓటు కూడా ఆయనకు కలిసి వస్తోంది. అదే నియోజకవర్గంలో కేసీఆర్ ఎంపీగా పోటీ చేయడం కలిసి వస్తోంది. దీంతో, దామోదరకు నువ్వా నేనా అన్నట్లు పోటీ ఇస్తున్నారు. దాంతో.. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ తన సొంత నియోజకవర్గంలో గెలవడానికే పరిమితమైపోయారు. ఇక, తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణవ్యాప్తంగా అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాల్సిన ఆయన కూడా హుజూర్ నగర్లో తన గెలుపునకు, కోదాడలో తన భార్య పద్మావతి గెలుపునకు పరిమితమైపోయారు. ముందు తాను గెలిస్తే అధిష్ఠానాన్ని ఎలాగోలా కాకాపట్టి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవాలని తప్పితే.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ అభ్యర్థులను గెలిపించాలనే ఆలోచననే ఆయన చేయడం లేదు. ఇక, తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ. తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన ఆయన కూడా తన సొంత నియోజకవర్గంలో గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఇప్పుడైనా గెలవాలని తంటాలు పడుతున్నారు. ఇక, ఆయన మిగిలిన అభ్యర్థలు గెలుపునకు ఏం కృషి చేస్తారు. పోనీ, మిగిలిన నాయకులను అయినా చూద్దాం. కాస్త స్టేచర్ ఉన్న నాయకుడు జానారెడ్డి. ఆయనకు పార్టీ ఎటువంటి బాధ్యతలు ఇవ్వలేదు. కానీ, తన సొంత నియోజకవర్గమైన నాగార్జున సాగర్లో ఆయన కూడా ఎదురీదుతున్నారు. జానారెడ్డి ఒక్కరే కాదు.. తెలంగాణలో బరిలో ఉన్న సిటింగ్ మంత్రులు, ఎమ్మెల్యేలంతా తీవ్రస్థాయిలో పోరాడుతున్నారు. తెలంగాణ వాదంతో తమకు ఓట్లు వర్షంలా కురుస్తాయని భావించిన వాళ్లకు తత్వం ఇప్పుడిప్పుడే బోధ పడుతోంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, గత ఐదేళ్లలో ఉద్యమాల గొడవలో నియోజక వర్గాలను పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ఎదురీదుతున్నారు. దీంతో, వారంతా తమ తమ నియోజక వర్గాలు దాటి రావడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు అయిన పాపానికి పొన్నాల లక్ష్మయ్య ఒక్కరే కాస్త తిరుగుతున్నారు. ఆయన కూడా హైదరాబాద్ కు, వరంగల్ జిల్లాకే పరిమితమవుతున్నారు. అయినా, పొన్నాలను చూసి నాలుగు ఓట్లు రాలతాయా? అందుకే ఆయన వస్తామన్నా మీరు రావద్దులే అని ఆయా అభ్యర్థులు ముఖం మీదే చెప్పేస్తున్నారట. ఆయన వస్తే నాలుగు ఓట్లు రాకపోవడానికి బదులు ఉన్న ఓట్లు పోయే ప్రమాదం ఉందని కూడా భావిస్తున్నారట. అందుకే కాంగ్రెస్ నాయకులంతా సోనియాను రాహుల్ ను తెలంగాణకు రావాలంటూ పదే పదే కోరుతున్నారట. దాంతో, తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇదెక్కడి దౌర్భాగ్యమని వాళ్లు తలలు పట్టుకుంటున్నారట. తెలంగాణ ఇచ్చి సీమాంధ్రలోనూ, తెలంగాణలోనూ కూడా పార్టీని సర్వనాశనం చేసేసుకున్నామని సోనియా ఇప్పటికే పలువురి వద్ద ఆవేదన కూడా వ్యక్తం చేశారు. దాంతో, తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు ‘స్టార్ క్యాంపెయినర్లు’గా జైరాం రమేశ్, కొప్పుల రాజు మిగిలారు. ఇటువంటి వాళ్లంతా తెలంగాణను అభివృద్ధి చేసేస్తామని, బంగారు తెలంగాణ చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. టీవీల్లో యాడ్లు ఇస్తున్నారు. ఇంతకుమించిన జోక్ మరొకటి ఉంటుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: