సీమాంధ్రలో నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి అయ్యింది. అయితే ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశంపార్టీల మధ్య పొత్తు ఒక కొలిక్కి రాలేదు. పొత్తు ఉన్నట్లో లేనట్లో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. సీమాంధ్రలోని మొత్తం 175 స్థానాలకు గానూ కేవలం 11 స్థానాలను బీజేపీకి కేటాయించింది తెలుగుదేశం పార్టీ. అయితే ఈ సీట్లలో కూడా తెలుగుదేశం తరపున అధికారికంగా నామినేషన్లు అయితే పడ్డాయి. తెలుగుదేశం అధినేత పేరు మీద స్వయంగా జారీ అయిన బీఫారాలతో టీడీపీ వాళ్లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నియోజకవర్గాలేమో తమవి అని బీజేపీ వాళ్లు అనుకొంటున్నారు. కానీ తెలుగుదేశం వాళ్లు అయితే తాము కూడా పోటీలో ఉన్నామని ప్రచారం కూడాచేసుకొంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు, కడప జిల్లాలో కడప, ప్రకాశంజిల్లాలో సంతనూతలపాడు వంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం తరపున బలమైన క్యాండిడేట్స్ బరిలో ఉన్నారు. బీజేపీ పోటీ చేస్తున్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ అధికారికంగానో, అనధికారికంగానో తెలుగుదేశం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారు కూడా అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ నియోజకవర్గాలపై బీజేపీ బోలెడు ఆశలు పెట్టుకొంది. కానీ తెలుగుదేశం తీరుతో ఆ ఆశలు అడియాసలు అయ్యేలా ఉన్నాయి. బీజేపీ విజయానికి ఏమైనా అవకాశాలు ఉంటే అవన్నీ తెలుగుదేశం పుణ్యమా అని నీరుగారిపోతున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే పొత్తు పెట్టుకొన్న పుణ్యానికి తెలుగుదేశం పార్టీనే బీజేపీని ఓడించేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో బీజేపీ నేతలు ఎలా ఫీలవుతున్నారో!

మరింత సమాచారం తెలుసుకోండి: