రాజకీయాలు చేయాలంటే ముందుగా ధైర్యం కావాలి. ధైర్యం, తెగువ లేకపోతే రాజకీయాల జోలికి అస్సలు వెళ్లనే కూడదు. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వంటి పిరికివాళ్లు, అందరితో మంచిగా ఉండాలని నటించేవాళ్లు రాజకీయాలకు అస్సలు పనికిరారనే విషయం మరోసారి రుజువైంది. కాళ్లూ గెడ్డం పట్టుకుని బతిమలాడినా పవన్ కల్యాణ్ కనికరించలేదు. రాష్ట్ర విభజన విషయంలో చేతులు కలిపినా చంద్రబాబు వాడుకుని వదిలేశారు. గుజరాత్ అల్లర్ల విషయంలో సమర్థంగా వ్యవహరించారంటూ కితాబులు ఇచ్చినా మోడీ కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. సాధారణంగా రెంటికి చెడ్డ రేవడి అని సామెత. కానీ, ఇప్పుడు జేపీ అన్నిటికీ చెడ్డ రేవడి. తన పరువును, మర్యాదను పోగొట్టుకున్నారు. ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వచ్చిన గుర్తింపును పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, చివరికి టీడీపీ నుంచీ ఆయనకు మద్దతు కరువైంది. పదేళ్ల కిందకి వెళ్లి ఆయన మరోసారి ఒంటరిగా మిగిలిపోయారు. జేపీకి కటారి శ్రీనివాసరావు.. కటారికి జేపీ అంతే. జయప్రకాశ్ నారాయణ అంటే తమకెంతో గౌరవమని మోడీ ప్రకటించారు. పవన్ కల్యాణ్ ప్రకటించారు. చంద్రబాబు కూడా అదే మాట చెబుతున్నారు. వాస్తవానికి, ఈ రచయితకు, మరెంతోమంది విద్యావంతులకు కూడా జేపీ అంటే అభిమానమే. ఐఏఎస్ గా ఉన్నప్పుడు ఆయన చేపట్టిన ఎన్నో కార్యక్రమాలతో ఆయన ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆ తర్వాత లోక్ సత్తా స్థాపించి ఎన్నో చట్టాల రూపకల్పనకు కృషి చేశారు. జేపీ లాంటి మేధావులు చట్టసభల్లో ఉండి తీరాల్సిందే. అటువంటి వాళ్ల సహకారంతో సమర్థవంతమైన చట్టాలను చేయడానికి అవకాశం ఉంటుంది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లలో జేపీ తెర వెనుక ఎంతో కృషి చేశారు. వివిధ చట్టాల రూపకల్పనలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారు. కానీ, ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆయన పడ్డ శ్రమ అంతా కాంగ్రెస్ జేబులోకి వెళ్లిపోయింది. శ్రమ దోపిడీని వ్యతిరేకించే జేపీ కూడా శ్రమ దోపిడీకి గురయ్యారని భావించవచ్చు. జయప్రకాశ్ నారాయణకు చంద్రబాబు మద్దతు ఇవ్వకపోవడం వెనక ఒక ఆసక్తికరమైన కథనం ఉందని గతంలో ప్రచారం జరిగింది. అవి కాంగ్రెస్ అధినేత్రిగా సోనియా రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజులు. అప్పట్లో వివిధ రాష్ట్రాల్లో బలమైన నేతలు, వారి బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవాలని ఆమె భావించారు. ఓసారి జైపాల్ రెడ్డిని పిలిపించారు. ఆంధ్రప్రదేశ్లోని నాయకులు, వారి వివరాలు కావాలని, ఇందుకు రాష్ట్రంలో తటస్థంగా ఉండే వ్యక్తి కావాలని అడిగారట. దానికి తటస్థంగా ఉండే వ్యక్తి ఎందుకు? మీకు ఏ వివరాలు కావాలంటే ఆ వివరాలు నేను చెబుతానని అన్నారట. దానికి సోనియా, మీరు వద్దు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం లేని ఒక తటస్థుడైన మేధావిని నాతో కలపండి అని కోరారట. అప్పుడు జైపాల్ రెడ్డి జయప్రకాశ్ నారాయణను సూచించారట. అప్పట్లో ఆయన సోనియాను కలిశారు. రాష్ట్రంలోని పార్టీలు, నాయకులు, వారి బలాలు, బలహీనతలు తదితరాలన్నీ వివరించారట. ఆ సమయంలోనే, రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన మోసకారి అయిన రాజకీయ నాయకుడు ఎవరు అని సోనియా ప్రశ్నించినప్పుడు జయప్రకాశ్ నారాయణ చంద్రబాబు పేరు చెప్పారట. అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా జేపీ ఇటు సోనియాతో, అటు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో టచ్ లో ఉంటూ చట్టాల రూపకల్పనలో సాయం చేస్తూ ఉన్నారట. అయినా, జేపీకి కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. సరికదా, రాష్ట్ర విభజన విషయంలో జేపీ మాటను కాంగ్రెస్ అస్సలు పట్టించుకోలేదు. దీంతో, ఆయన కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెంచుకున్నారని చెబుతారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబూ జేపీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ తోనూ వ్యవహారం చెడింది. దాంతోనే ఆయన మోడీ జిందాబాద్ అంటున్నారు. రాజకీయాలు చేయాలంటే ధైర్యం కావాలని ముందుగా చెప్పుకొన్నాం కదా. జేపీకి ధైర్యమూ లేదు. సరైన వ్యూహం కూడా లేదు. ఉదాహరణకు, జేపీ ఎంత బలపడితే చంద్రబాబుకు అంత నష్టం. అటువంటప్పుడు జేపీకి చంద్రబాబు ఎందుకు మద్దతు ఇస్తారు? దానికితోడు 2004, 2009 ఎన్నికల్లో జేపీ చీల్చిన ఓట్లన్నీ చంద్రబాబుకు పడేవే. వాటిని చీల్చడం ద్వారా జేపీ పరోక్షంగా కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చారు. అటువంటప్పుడు జేపీ ఎంత దిగజారితే తనకు అంత మంచిది అని చంద్రబాబు భావిస్తారు. కానీ, ఆయన ఎదగడానికి ఒక చెయ్యి ఎందుకు వేస్తారు? ఈ విషయం కూడా తెలుసుకోలేని మేధావులు వాళ్ల మద్దతు కోరతారు ఏమిటో? ఇక, జేపీ మీద గౌరవం ఉంది కానీ, మోడీ చెప్పారు కనక మల్లారెడ్డికే నా మద్దతు అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తద్వారా, ఇటీవలి కాలంలో అటు మోడీ చుట్టూ ఇటు పవన్ కల్యాణ్ చుట్టూ జేపీ చేసిన ప్రదక్షిణలు అన్నీ వృథా అయినట్లే. ఆ ప్రదక్షిణలు ప్రజల చుట్టూ చేసి ఉన్నా ఏదో కాస్త ఓట్ల లాభం అన్నా వచ్చేది. ఇప్పుడు మల్కాజిగిరిలో జేపీ పరిస్థితి ఏమిటో చూద్దాం. ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతు లేదు. కాంగ్రెస్ దగ్గరకు రానివ్వదు. కేవలం లోక్ సత్తా తరఫున ఆయన బరిలోకి దిగారు. అదే నియోజకవర్గంలో ఆయనతోపాటు పలువురు ఉద్దండులు కూడా పోటీ చేస్తున్నారు. అయితే, సీమాంధ్రులు, విద్యావంతులు అత్యధికంగా ఉన్న ఈ నియోజక వర్గంలో జేపీకి ఇప్పుడు డిపాజిట్లు దక్కకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇందుకు సీమాంధ్రులను, విద్యావంతులను తప్పుబట్టాల్సిన పని లేదు. తప్పంతా జేపీదే. ప్రజలను నమ్ముకోవాల్సిన ఆయన కూడా విలువలను వదిలేసి దళారులను ఆశ్రయించారు. మీ నియోజకవర్గంలో జేపీ పోటీ చేస్తే మీలో ఎంతమంది ఓటు వేస్తారు? అరవింద్ కేజ్రీవాల్ తరహాలో దూకుడు, వ్యూహ చతురత, ఓపిక, సహనం ఉంటే ఎంతో కొంత విజయం సాధించవచ్చు. కానీ, అవేమీ లేకపోతే రాజకీయాల్లో రాణించడం కష్టం. రాజకీయాల్లో అందరికీ మంచివాడు అసమర్థుడిగానే మిగిలిపోతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: