అధికారం కోసం మన నేతలు ఎంతకైనా దిగజారుతారు. కాలం కలిసిరాకపోతే ప్రత్యర్థిని కూడా ప్రసన్నం చేసుకుంటారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడుదే రిపీటవుతోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఓ నేత.. ఒకానొక సమయంలో తనను కలవాలనుకుంటే అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు కూడా ఆలోచించే వ్యక్తిని ప్రసన్నం చేసుకునేందుకు చక్కర్లు కొడుతున్నారు. ఇంకొకాయన స్టార్ బ్రాండ్ నే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. తల తోకను ఆడిస్తుందా లేక తోక తలను ఆడిస్తుందా..? ఇంతకీ ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటారా.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత, దేశ రాజకీయాల్ని శాసించాలనుకునే నేతలిద్దరి వ్యవహారశైలిని చూసిన వారికి ఈ అనుమానం కలుగుతోంది. అధికారం కోసం రాజకీయనేతలు దేనికైనా దిగజారుతారని వింటుంటాం. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ఇద్దరూ ఈ కేటగిరిలో చేరిపోయారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించి రికార్డు సృష్టించానని, బిల్ క్లింటన్ బిల్ గేట్స్ తనను వెదుక్కుంటూ హైదరాబాద్ వచ్చారని చంద్రబాబు తెగ బిల్డప్ ఇస్తుంటారు. ఏం చేయకుండా తెగ సీన్ క్రియేట్ చేసే వారితో పోలిస్తే.. ఎంతో కొంత అభివృద్ధి చేసిన చంద్రబాబు తన గొప్పను చెప్పుకోవడంలో తప్పులేదు. నిజానికి హైదరాబాద్ ను దేశంలోనే కాకుండా ప్రపంచంలో చెప్పుకోతగ్గ స్ధాయికి తీసుకువెళ్లిన క్రెడిట్ చంద్రబాబుదే అనడంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా చంద్రబాబుకి క్రేజ్ పెరగడం వల్లే ఆయనకు హైటెక్ సీఎంగా పాపులారిటీ వచ్చింది. నరేంద్రమోడి, నితీష్ కుమార్ లకు ఇప్పుడు ఉత్తమ సీఎంలుగా పేరు, ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ 15 ఏళ్ల క్రితం చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు ఆదర్శ ముఖ్యంమంత్రిగా గుర్తింపు తెచచుకున్నారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న బాబు ప్రతిపక్షంలో కూర్చున్న వెంటనే సీన్ రివర్స్ అయిపోయింది. అడ్డమైన వారి బెదిరింపులకు చంద్రబాబు బెదిరిపోవడం మొదలుపెట్టారు. దీంతో బాబుతో కొందరు టీడీపీలోని ముదురు నేతలు ఆడుకుంటున్నారు. సొంత పార్టీనేతలకే కాదు ఎన్నికల సమయంలో తనకు ప్రమాదంగా మారుతారనుకున్న ప్రత్యర్ధులను చూసి కూడా చంద్రబాబు బెంబేలెత్తిపోవడం పరిపాటిగా మారింది. గత ఎన్నికల్లో చిరంజీవిని చూసి బాబు బెదిరిపోతున్న విషయాన్ని గమనించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడంలో అనుకున్నది సాధించారు. టీఆరెస్ తో చిరంజీవి కలుస్తారనే భయంతో చంద్రబాబు కేసీఆర్ తో జట్టు కట్టారు. చివరకు అదే ఆయన కొంప ముంచింది. టీఆర్ఎస్ తో పొత్తు కోసం గత ఎన్నికల్లో చాలా మెట్లు దిగి వచ్చిన చంద్రబాబు ఈ ఎన్నికల్లో నిన్న కాక మొన్న పుట్టుకొచ్చిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనపై అంచనాలను బాగా పెంచేసుకున్నారు. తన ప్రధాన ప్రత్యర్ధి జగన్ కి సీమాంధ్రలో చెక్ పెట్టాలంటే అది పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని బాబు డిసైడ్ అయిపోయారు. చంద్రబాబులోని ఈ వీక్ నెస్ ని గమనించిన పవన్ ఆయనకు దూరంగా ఉంటూ తనకున్న రేంజ్ ని చాటుకునే ప్రయత్నం చేశారు. అధికారం కోసం ఆరాటం పెరగడంతో పవన్ రాక కోసం వెయిట్ చేసిన చంద్రబాబు చివరకు ఆయన రారని తెలియడంతో తానే పవర్ స్టార్ ఇంటికి వెళ్లారు. నరేంద్రమోడి సభలో తన పేరును సైతం ప్రస్తావించడానికి ఇష్టపడని పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లడం రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యింది. ఒకప్పుడు మెగా స్టార్ చిరంజీవి కూడా చంద్రబాబు అపాయింట్ మెంట్ తీసుకుని కలిసే పరిస్ధితి ఉంటే ఇప్పుడు పరిస్ధితి తారుమారయ్యింది. కాలం కలిసిరాక పోతే పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఇదేనేమో. మోడీ కూడా అంతే..! చంద్రబాబు పరిస్ధితి ఇలా ఉంటే అధికార దాహంతో నరేంద్రమోడీ అనుసరిస్తున్న వైఖరి కూడా విదాస్పదమవుతోంది. దేశంలోని ప్రధాన పార్టీల నేతలు, సెలబ్రిటీలు, స్టార్ డమ్ ఉన్న హీరోలు, హీరోయిన్లు నరేంద్ర మోడీ జపం చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం దేశంలో అందరికంటే మోస్ట్ పాపులర్ పర్సన్ గా మోడీ గుర్తింపు తెచ్చుకున్నారు. ట్విట్టర్ తో పాటూ ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీయాలోనూ మోడీ హల్చల్ చేస్తున్నారు. తనను మతోనమ్మదిగా విమర్శించిన చంద్రబాబు వంటి నేతలు సైతం ప్రధాని కావాలని కోరుకునే స్ధాయికి మోడీ ఎదిగిపోయారు. ఇంత ఆదరణ పొందిన నేత కూడా ఎన్నికల్లో అధిక సీట్లు పొందడం కోసం ఇమేజ్ ని లెక్కచేయకుండా సినీహీరోలు శరణ్యం అంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాదిలో నరేంద్రమోడీ హవా ఉందేమో కానీ దక్షణాదిలో, ముఖ్యంగా తమిళనాట అంత సీన్ కనిపించడంలేదు. ద్రావిడ పార్టీల ఆధపత్యమున్న తమిళనాట జయలలిత, కరుణానిధిల ధాటిని తట్టుకుని పాగా వేసేందుకు నరేంద్రమోడీ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని ప్రసన్నం చేసుకోవాలనుకున్నారు. గతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓ సారి చేతులు కాల్చుకున్న రజినీకాంత్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రజినీకి సన్నిహితుడుగా ఉన్న తుగ్లక్ పత్రిక సంపాదకుడు ఛో రామస్వామి తనకు కూడా ఆప్తుడు కావడంతో మోడీ ఆయన ద్వారా ఈ కథ నడిపించాలనుకున్నారు. అనుకున్న ప్రకారం రజినీకాంత్ అపాయింట్ మెంట్ ఫిక్స్ చేయడంతో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని రజినీ ఇంటికి వెళ్లి మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగైనా రజినీకాంత్ తనకు బహిరంగ మద్దతిస్తారని ఆశించారు. కానీ దేవుడు మోడీ మనసులోని కోర్కెను తీరుస్తారని.. రజినీ తనదైనశైలిలో కామెంట్ చేసి వ్యూహాత్మకంగా తప్పించుకున్నారు. మొత్తంమీద మోడీ వాలకాన్ని చూసిన వారందరికి ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ డెడ్ అనే ఆంగ్లనానుడి గుర్తుకుతెచ్చింది. చివరకు హతవిధీ అని మోడీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: