కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సిటింగ్ ఎమ్మెల్యే, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి భూమా శోభానాగిరెడ్డి మృతి చెందారు. బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నియోజకవర్గంలోని గూబగుండ్లపాలెం నుంచి ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దాంతో తీవ్ర గాయాలైన ఆమెను నంద్యాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్ కి తరలించారు చికిత్స పొందుతూ శోభా నాగిరెడ్డి మృతి చెందారు. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి మూడవ కుమార్తె అయిన శోభ ఇంటర్మీడియెట్ వరకు రెగ్యులర్ గా చదివి ఆ తరువాత డిస్టెన్స్ ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి తండ్రి రాజకీయ వ్యవహారాలను దగ్గరగా గమనించిన అనుభవంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. శోభకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో మహిళలు రాణించడం అంత సులువు కాదు. అయినా శోభ అన్నింటినీ భరించి, ఎదురొడ్డి రాష్ట్రంలోనే అతికొద్ది మంది ముఖ్య మహిళా నేతల్లో ఒకరుగా నిలిచారు. ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దని, ప్రశాంత జీవితం కావాలని నిత్యం భర్త భూమాకు చెప్పేది. ఫ్యాక్షన్ కు వ్యతిరేకంగా భూమా నాగిరెడ్డి శాంతియాత్ర చేయడం వెనుక శోభ కీలకపాత్ర పోషించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలను పేరు పేరునా పిలువగలిగేంత సన్నిహితంగా ఉంటారామె. కార్యకర్తలయినా, ప్రజలైనా తమ సమస్యలను చెప్పుకునేందుకు భూమా నాగిరెడ్డి కంటే శోభను కలవడానికే ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే భూమా నాగిరెడ్డి రాజకీయ భవిష్యత్తు శోభానే. 

మరింత సమాచారం తెలుసుకోండి: