ఆళ్లగడ్డ ఆడపడుచుగా గుర్తింపు పొందిన శోభా నాగిరెడ్డి కేవలం కర్నూలు జిల్లాలోనే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 199౬లో భర్త ప్రోత్సాహంతో రాజకీయ ప్రవేశం చేసిన శోభ వివిధ పార్టీల తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్టీసీకి తొలి ఛైర్ పర్సన్ గా ఎన్నికై ఆమె రికార్డు సృష్టించారు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ తరపున తన వాదనను బలంగా వినిపించి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. రాయలసీమ రాజకీయాలకు శోభా నాగిరెడ్డి పర్యాయపదమై నిలిచారు. మృదుస్వభావిగా.. సమర్థురాలైన నేతగా శోభానాగిరెడ్డి సొంత నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా తనదైన ముద్రవేశారు. మాజీ మంత్రి, తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శోభ.. 1996లో టీడీపీ తరపున క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. అళ్లగడ్డలో పుట్టి పెరిగిన శోభ.. ఇంటర్ వరకూ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1986లో భూమా నాగిరెడ్డితో శోభా వివాహం జరిగింది . శోభానాగిరెడ్డికి ముగ్గురు పిల్లలు. అప్పటి వరకూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న భర్త భూమానాగిరెడ్డి 199౬లో లోక్ సభ కు ఎన్నిక కావడంతో ఆ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి శోభా నాగిరెడ్డి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1999లో మరోసారి గెలిచిన ఆమె 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో శోభా నాగిరెడ్డి 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి మరోసారి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రెండేళ్ల క్రితం జగన్ పార్టీలో చేరిన శోభానాగిరెడ్డి ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.  రాజకీయ ప్రస్థానం: 1996లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక ,1986లో భూమా నాగిరెడ్డి తో వివాహం శోభ దంపతులకు ముగ్గురు సంతానం, 96, 99లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నిక ,2004లో ఓటమి 2009లో ప్రజారాజ్యం తరపున ఎన్నిక, 2012 ఉప ఎన్నికల్లో వైకాపా తరపున గెలుపు, టీడీపీలో ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి బాధ్యతలు పీఆర్ పీ, వైసీపీలో కూడా అధికార ప్రతినిధి బాధ్యతలు ఆర్టీసికి తొలి ఛైర్ పర్సన్ గా రికార్డు టీడీపీలో ఉన్న సమయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి బాధ్యతలు నిర్వహించారు. ప్రజారాజ్యం, వైసీపీలో కూడా అధికార ప్రతినిధి బాధ్యతలు నిర్వహించి ఆయా పార్టీల వాదనను బలంగా వినిపించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో శోభా నాగిరెడ్డి ఆర్టీసీకి ఛైర్ పర్సన్ గా నియమితులయ్యారు. ఆర్టీసికి తొలి ఛైర్ పర్సన్ గా ఎన్నికై ఆమె రికార్డు సృష్టించారు.  రాయలసీమ రాజకీయాలకు శోభా నాగిరెడ్డి కుటుంబం పర్యాయపదమై నిలిచింది. శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి మాజీ మంత్రి కాగా, భర్త భూమా నాగిరెడ్డి నంద్యాల మాజీ ఎంపీ. ఇక శోభ సోదరుడు ఎస్వీ మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ. కుటుంబంలో ఎంత మంది ఉన్నా.. ఓ మహిళా నాయకురాలిగా శోభా నాగిరెడ్డి తనదైన గుర్తింపు తెచ్చుకుని రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. ఏపార్టీలో చేరినా ప్రజల సమస్యలపై పోరాడుతూ.. రాజకీయాలకే వన్నె తెచ్చిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆళ్లగడ్డ అసెంబ్లీ స్ధానానికి వైసీపీ తరపున పోటీ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: