రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్న సామెతను అక్షరాలా రుజువు చేస్తున్నాడు తెలంగాణ సీఎం కేసీఆర్. సమైక్య ఉద్యమాన్ని భుజాన వేసుకుని మోసిన ఏపీఎన్జీవోలపై అదను చూసి దెబ్బ కొట్టాడు. భూమి అప్పగించి.. ఆరేళ్లైనా.. నిర్మాణాలు చేపట్టలేదన్న సాకుతో.. హైదరాబాద్ లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో కేటాయించిన 189 ఎకరాల భూమిని ఉన్నపళంగా లాగేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. నిర్మాణాలు చేపట్టలేదన్నది కేవలం సాకు మాత్రమేనని అందరికీ తెలుసు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనుకున్న కారణాలు ఊహించలేనివేమీ కాదు. ఏపీఎన్జీవోలకు 2008లో భూమి అప్పగించినా కోర్టు వివాదాల కారణంగా నిర్మాణాలు చేపట్టలేకపోయామని ఏపీఎన్జీవోలు చెబుతున్నారు. ఈ భూమిపై 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి లేఔట్ వేయించుకున్నామని.. మరో 15 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, గార్డెన్, ఆఫీస్ వంటి సౌకర్యాలు కల్పించుకున్నామని.. ఇప్పుడ అకస్మాత్తుగా లాగేసుకోవడం అన్యాయమంటున్నారు. ఏపీఎన్జీవోల్లోని అంతర్గత విభేదాలు కూడా ఆలస్యానికి కారణమన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. కక్షసాధింపు ధోరణి కారణంగానే భూమిని లాగేసుకుందన్న విషయం బహిరంగ రహస్యమే. జగన్ చాన్నాళ్ల తర్వాత.. కేసీఆర్ కు వ్యతిరేకంగా స్పందించాడు. ప్రెస్ మీట్ ద్వారా కాకపోయినా ప్రెస్ నోటయినా రిలీజ్ చేశాడు. ఏపీఎన్జీవోల భూమి లాక్కోవడం అన్యాయమని అభ్యంతరం వ్యక్తం చేశాడు. వారికి అండగా నిలుస్తామంటూనే.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కలుగ జేసుకుని న్యాయం చేయాలని బంతిని చంద్రబాబు వైపు విసిరేశాడు. ప్రెస్ మీట్ పెట్టే సాహసం చేయని జగన్ కనీసం ప్రెస్ నోట్ ద్వారానైనా స్పందించాడు కానీ.. చంద్రబాబు ప్రభుత్వం కానీ.. మంత్రులు కానీ.. పార్టీ నాయకులు గానీ.. ఒక్కరు కూడా ఇంతవరకూ ఇది అన్యాయం అన్నపాపాన పోలేదు. ఏపీఎన్జీవోలకు అనుకూలంగా మాట్లాడితే.. హైదరాబాద్ లోని తమ భూముల లెక్కలు ఎక్కడ తీస్తాడని భయపడ్డారో.. తమ భూబాగోతాలు ఎక్కడ వెలికితీస్తాడని అనుకున్నారో కానీ.. ఏపీఎన్జీవోలకు ఈ విషయంలో కనీస సానుభూతి కరవైంది. ఓట్ల కోసం ఉద్యోగులను అడ్డం పెట్టుకున్న పార్టీ... అవసరానికి కనీసం మాట సాయమైనా చేయలేకపోతున్నాయి. జగన్ చూపించిన పాటి కనీస ధైర్యాన్ని చంద్రబాబు ఎందుకు చూపించలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: