తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవచించిన రెండు కళ్ల సిద్ధాంతం పరాకాష్టకు చేరినట్టుగా ఉంది. రాష్ట్ర విభజన వ్యవహారంలో తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని బయటకు చెప్పిన బాబు ఇప్పుడు రాజకీయాలను చేయడంలో కూడా అదే పద్ధతినే కొనసాగిస్తున్నాడు. తెలుగుదేశం సీమాంధ్ర, తెలంగాణ విభాగాలకు అధిపతి అయిన బాబు ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో కంటితో చూస్తున్నాడు! ఒకవైపు జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీమాంధ్రలో వైకాపా భరతం పట్టి ఆ పార్టీ గుర్తుపై గెలిచిన ఎంపీటీసీలను, జడ్పీటీసీలను తమవైపుకు తిప్పుకొని తెలుగుదేశం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. అసలు ఏ మాత్రం బలం లేని మండలాల్లో కూడా తెలుగుదేశం ఆశ్చర్యకరమైన విజయాన్ని సాధించింది. మరి సీమాంధ్రలో పరాయి బలంతో గట్టెక్కిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మాత్రం తన బలాన్ని నిలువుదోపిడీ ఇచ్చుకొంది! తాడిని తన్నేవాడుంటే.. వాడి తలను తన్నేవాడుంటాడన్నట్టుగా... సీమాంధ్రలో ప్రతిపక్ష వైకాపాను నిలువుదోపిడీ చేసిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ ఎత్తులకు చిత్తు అయ్యింది. తనవైపున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను నిలబెట్టుకోలేకపోయింది. వాళ్లను టీఆర్ఎస్ వాళ్లు తమవైపుకు తిప్పుకొన్నారు! తమకు అవసరమైన బలంగా మార్చుకొన్నారు. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతోంది. కేసీఆర్ నీఛ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శిస్తోంది. మరి సీమాంధ్రలో తాము చేసింది కూడా అవే రాజకీయాలు అని తెలుగుదేశానికి తెలుసోలేదో కానీ.. ఇప్పుడు పార్టీ గీత దాటిన ఎంపీటీసీలను, జడ్పీటీసీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది! వాళ్లకు నైతిక విలువలు లేవని టీడీపీ తెలంగాణ విభాగం అభిప్రాయపడుతోంది. మరి టీడీపీ తీరు ఎలా ఉందంటే... తాము చేస్తే శృంగారం, వేరేవాళ్లు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా..!

మరింత సమాచారం తెలుసుకోండి: