వీకే దుగ్గల్.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది.. కదూ.. ఔను మీ జ్ఞాపకశక్తిని మెచ్చుకోవాల్సిందే. శ్రీకృష్ణ కమిటీ సభ్యుల్లో ఈయన ఒకడు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు, భావోద్వేగాల నేపథ్యంలో కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించింది. 2010 ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రమంతా పర్యటించిన శ్రీకృష్ణ కమిటీ- అనేక విషయాలను లోతుగా పరిశీలించింది. వివిధ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో పర్యటించిన అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుంది. తాము సేకరించిన వివరాలు, విషయాలన్నింటినీ శ్రీకృష్ణ కమిటీ సమగ్రంగా విశ్లేషించింది. వివిధ అంశాలపై సమాచారాన్ని క్రోడీకరించి కీలక వ్యాఖ్యలు చేసింది. కమిటీ నివేదిక రూపకల్పనలో జస్టిస్ శ్రీ కృష్ణ కంటే ఎక్కువ పాత్ర పోషించిన కమిటీ సభ్యుడు వీకే దుగ్గల్. మొత్తమ్మీద ఏ ప్రాంతమూ వివక్షకు గురికాలేదని, అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించే వీలుందని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో అంతిమంగా సూచించింది. వీకే దుగ్గల్ సీమాంధ్ర నేతల ప్రభావానికి గురికావడం వల్లే.. ఇలాంటి నివేదిక రూపొందించారని తెలంగాణవాదులు అప్పట్లో ఆరోపించారు. అలాంటి దుగ్గల్ ను తెలంగాణ గవర్నర్‌గా నియమించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్‌గా ఉన్న దుగ్గల్‌ను తెలంగాణకు బదిలీ చేయించేందుకు సీమాంధ్రకు చెందిన కొందరు పెద్దలు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా పూర్తికాకుండానే విపరీతమై దూకుడు ప్రదర్శిస్తూ.. హైదరాబాద్ లోని సీమాంధ్రులను భయపెడుతోన్న కేసీఆర్ ను అడ్డుకోవాలంటే.. బలమైన గవర్నర్ అవసరమని సీమాంధ్రనేతలు భావిస్తున్నారట. అందుకే..నరసింహన్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పరిమితం చేసి తెలంగాణకు దుగ్గల్‌ను బదిలీ చేయించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మేరకు కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడుపై ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. భూవివాదాలు, శాంతిభద్రతల సమస్యలు వంటి విషయాల్లో గవర్నర్ ది కీలక పాత్ర కానున్న తరుణంలో.. దుగ్గల్ తెలంగాణకు గవర్నర్ గా వస్తే.. రాజకీయం మరింత వేడెక్కడం ఖాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: