కె. చంద్రశేఖర్ రావు, ఎన్. చంద్రబాబు నాయుడు... ఈ ఇద్దరు నేతల మధ్యనా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి రాజకీయ వైరుధ్యం ఉంది. రాష్ట్ర విభజన తర్వాతనే కాదు... తెలంగాణ ఉద్యమం కేసీఆర్ మొదలు పెట్టిన నాటి నుంచీ వీరిద్దరే ఒకరికొకరు టార్గెట్ గా ఉంటూ వచ్చారు. ఆనాడే మంత్రి పదవి ఇచ్చుంటే కేసీఆర్ తెలంగాణ ఊసెత్తేవారే కారని బాబు విమర్శిస్తే... రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికే సిద్ధపడిన తనకు మంత్రి పదవి సమస్యే కాదని కేసీఆర్ సమాధానమిస్తారు. వచ్చిన తెలంగాణను అర్ధరాత్రి కుట్ర అంటూ బాబు అడ్డుపడ్డారని కేసీఆర్ విమర్శిస్తే... ఫ్యామిలీ కలెక్షన్ల కోసమే ఉద్యమం లేవనెత్తారని బాబు మండిపడ్డారు. ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా మెలిగే ఈ ఇద్దరూ తొలిసారిగా సమావేశం కానున్నారా... అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది అధికార వర్గాల నుంచి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదం పరిష్కారానికై ఇరువురు సీఎంల సమావేశం జరిగే అవకాశం ఉంది. అయితే ఇందుకు వేదిక ఎక్కడ అనేది ఇంకా ఖరారు కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు వర్తించవంటూ తెలంగాణలోని డిస్కంలకు తేల్చి చెప్పింది. అయితే ఇందుకు విద్యుత్ నియంత్రణ సంస్థ - ఈఆర్సీ అంగీకరించలేదు. బెంగళూరులోని ఎస్ఆర్ఎల్డీసీ రంగంలోకి దిగినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. దీంతో ఈ విషయంపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రధానికి విన్నవించేలా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయింది. కమిటీలో భాగంగా కేంద్ర విద్యుత్ సంస్థ-సీఈఏ ఛైర్ పర్సన్ ఈనెల 14 న రెండు రాష్ట్రాల ఇందన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అధికారికంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వాధనలు విన్న తర్వాత సీఎంల సమావేశం జరిగే అవకాశం ఉంది. రాజకీయ పరమైన నిర్ణయాల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులతోనూ సమావేశం జరపాలనే చర్చ జరుగుతోంది. ఈ సమావేశం పీఎం నరేంద్రమోడీ సమక్షంలో కానీ... కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వద్ద గానీ జరపాలని కేంద్రం యోచిస్తోంది. గతంలో టీడీపీ తొమ్మిదేళ్ల పాలన తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని కేసీఆర్ పలుమార్లు ఆరోపించారు. తన హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమని బాబు ప్రకటించారు. కేసీఆర్ సైతం అనేక సందర్భాలలో బహిరంగ చర్చకు డిమాండ్ చేశారు. అయితే ఇవి ఎప్పుడూ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మాత్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల హోదాలో ఇద్దరూ సమావేశం కానున్నారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా కేసీఆర్-బాబు పలుమార్లు సమావేశమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: