అడకత్తెరలో పోకచెక్కలా మారుతోంది టి-టిడీపీ నేతల పరిస్థితి. తెలంగాణ సీమాంధ్ర గొడవల్లో వారు నలిగిపోతున్నారు. రెండు రాష్ట్రాల వివాదాలు చంద్రబాబు కేంద్రంగా సాగుతుండటం వల్ల.. ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోసం అన్నట్టు తయారైంది వాళ్ల పరిస్థితి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అధికారాలను గవర్నర్‌కు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖతో వారు ఇబ్బందుల్లో పడ్డారు. అధినేత తీరును వారు గట్టిగా బహిరంగంగా వ్యకిరేకించలేరు. అలాగని పూర్తిగా సమర్థించనూ లేరు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం బాబు కేంద్రానికి లేఖ రాయడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని మనసులో అభిప్రాయం ఉన్నా.. ఆ మాట గట్టిగా అనలేని పరిస్థితి. బాబు తీరుతో తెలంగాణలో పార్టీకి నష్టం జరుగుతున్నదని వారు ఆవేదన చెందుతున్నారు. పోలవరం విషయం , విద్యుత్ వివాదం వంటి అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని తెలంగాణ టీడీపీ నేతలకు అధినేత ఆంక్షలు విధించినట్టు వారు మీడియాతో గోడువెళ్లబోసుకుంటున్నారు. గురుకుల్ ట్రస్ట్ భూములు, ఏపీఎన్జీవోల భూమి వంటి విషయాల్లో కేసీఆర్ తీరు న్యాయమా.. అన్యాయమా అనే విషయం పక్కకుబెడితే... ఈ చర్యలతో తెలంగాణ జనం కేసీఆర్ ను హీరోలా చూస్తున్నారని టి-టిడీపీ నేతలు భావిస్తున్నారు. అలాంటి చర్యలను విమర్శిస్తూ.. మీడియా సమావేశాలు నిర్వహిస్తే ఇప్పటికే తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి.. మరింత దిగజారుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: