వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఇడుపులపాయకు రానున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి సోమవారం రాత్రి వెంకటాద్రిలో బయలుదేరి ఎర్రగుంట్లలో దిగిన అనంతరం నేరుగా ఇడుపులపాయకు చేరుకుంటారు. మంగళవారం ఉదయం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. ఇడుపులపాయలో మధ్యాహ్నం వరకు ఉండి అనంతరం పులివెందులకు చేరుకుంటారు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో వేంపల్లె మండల నేతలతో సమావేశమవుతారన్నారు. అలాగే 9వ తేదీ బుధవారం ఉదయం పులివెందుల కార్యాలయంలో సింహాద్రిపురం మండల నాయకులతో గ్రామాల వారీగా సమీక్ష చేస్తారన్నారు. మధ్యాహ్నం లింగాల మండలంలోని గ్రామాల వారీగా సమీక్షతోపాటు నాయకులు, కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకుంటారని ఎమ్పీ చెప్పారు. ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ విజయమ్మ, షర్మిల : వేంపల్లె మండలంలోని ఇడుపులపాయకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత నేత వైఎస్‌ఆర్ కుమార్తె షర్మిల సోమవారం రాత్రి చేరుకున్నారు. మంగళవారం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకలు జరగనున్న నేపథ్యంలో వారు ఇక్కడికి చేరుకున్నారు. బెంగుళూరు నుంచి పులివెందుల మీదుగా వారు ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా వైఎస్ 65వ జయంతి వేడుకలకు వైఎస్‌ఆర్ ఘాట్‌లో సోమవారం రాత్రికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బెంగుళూరుకు చెందిన వ్యక్తులు వివిధ రకాల పూలతో సమాధిని అలంకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: