అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ మెడకు కూడా చుట్టుకుంటుందా? ఈ ఒప్పందంపై ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా పనిచేసిన ఎంకె నారాయణన్‌, అప్పటి ఎస్‌పిజి చీఫ్‌ బివి వాంచూలను ప్రశ్నించిన సిబిఐ తాజాగా నరసింహన్‌ను కూడా ప్రశించనున్నది. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ నుండి 12 వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలులో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో సాక్షిగా ఎపి, తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ వాంగ్మూలాన్ని సిబిఐ త్వరలో రికార్డు చేయనున్నది. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం సమయంలో నరసింహన్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు. 2005 మార్చి 1వ తేదీన జరిగిన సమావేశంలో అప్పటి ఎన్‌ఎస్‌ఎ చీఫ్‌ ఎంకె నారాయణన్‌, ఎస్‌పిజి చీఫ్‌ వాంచూలతో పాటు నరసింహన్‌ కూడా పాల్గొన్నారు. హెలికాప్టర్‌ ప్రయాణించే ఎత్తు తగ్గింపు వ్యవహారంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ హెలికాప్టర్లను అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కొనుగోలుకు తీసుకున్న నిర్ణయంలో వారు కూడా భాగస్వాములుగా వున్నారు. ఇటీవలనే నారాయణన్‌, వాంచూలను సిబిఐ సాక్షులుగా ప్రశ్నించింది. రూ.3600 కోట్లు హెలికాప్టర్ల ఒప్పందంలో రూ.360 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. హెలికాప్టర్‌కు సంబంధించి సాంకేతికపరమైన అంశాలలో కీలక మార్పులు తీసుకున్న సమావేశంలో భాగ స్వాములుగా వున్నందుకు నారాయణన్‌, వాంచూ లను ప్రశ్నించినట్లు సిబిఐ వర్గాలు వెల్లడించాయి. అదే సమావేశంలో నరసింహన్‌ పాల్గొన్నందున ఆయన వాంగ్మూలం కూడా కీలకమైనదేనని, సర్వీసు సీలింగ్‌ తగ్గింపునకు కారణాల గురించి అదనపు సమాచారం రాబట్టడానికి ఆయనను ప్రశ్నిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: