పరిటాల తెలుగుదేశం నేతే అయ్యుండొచ్చు.. ఆయన హత్య గురించి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాట్లాడటం భలే విచిత్రంగా ఉంది. ఆ హత్యకు మూల కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనంటున్నాడు తెలుగుదేశం నేత వర్ల రామయ్య. జగన్ పేరుతో పాటు రామయ్య వైఎస్ పేరును కూడా ప్రస్తావించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్ అనడంతోనే పరిటాల హత్య జరిగిందని వర్ల రామయ్య ఆరోపిస్తున్నాడు! అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇది కొత్త వెర్షన్ అని చెప్పవచ్చు! పరిటాల హత్య జరిగిన వెంటనే కూడా తెలుగుదేశం పార్టీ స్పందించింది. పరిటాల హత్య కు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అందులో జగన్ మోహన్ రెడ్డి, దివాకర్ రెడ్డిల హస్తం ఉందని అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. వెంటనే దివాకర్ రెడ్డిని మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. దివాకర్ రెడ్డి, జగన్ ల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించడం అన్యాయం అని అనేక మంది తెలుగుదేశం నేతలు అనంతపురం వరకూ వచ్చి గగ్గోలు పెట్టారు! మరి ఆ తర్వాత పరిణామాలెన్నో మారిపోయాయి. దివాకర్ రెడ్డిని తెలుగుదేశం వాళ్ల కళ్లకు అద్దుకొని పార్టీలో చేర్చుకొన్నారు. తెలుగుదేశం పెద్ద దిక్కును హత్య చేయించడాన్న ఆరోపణలున్న నేతను తెలుగుదేశం వాళ్లు పార్టీలోకి చేర్చుకొని, ఎంపీ టికెట్ ఇచ్చి , ఒక జిల్లా టీడీపీ బాధ్యతలను ఆయన చేతికి అప్పగించారు! దివాకర్ రెడ్డి ప్రొటెం స్పీకర్ గా కూర్చొంటేనే పరిటాల సునీత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి ఇష్టపడలేని స్థాయి నుంచి ఇప్పుడు దివాకర్ రెడ్డి తో కలిసి పార్టీల బలోపేతం గురించి చర్చలు జరిపే స్థితి వచ్చింది. మరి ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ రవి హత్య గురించి మాట్లాడి జగన్ ను బద్నాం చేద్దామని చూస్తోంది. ఇన్ని రోజులూ దివాకర్ రెడ్డి కి కూడా రవి హత్యతో సంబంధం ఉందని చెబుతూ.. ఇప్పుడు మాత్రం జగన్ కు మాత్రమే రవి హత్యతో సంబంధం ఉందని అంటున్నారు. మరి వీళ్ల పార్టీలోకి వచ్చిన దివాకర్ రెడ్డి ఇప్పుడు పవిత్రుడు అయిపోయాడా? దీనిపై టీడీపీ వివరణ ఇస్తుందా!

మరింత సమాచారం తెలుసుకోండి: