గుజరాత్ కు చెందిన వ్యక్తి ప్రధానమంత్రి, గుజరాత్ కే చెందిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు! ఇలా రెండు కీలకమైన పదవుల్లో ఇద్దరూ గుజరాతీలే అవుతారు! దీని వల్ల ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్లు వెళతాయని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు కొంతమంది కమలనాథులు. బీజేపీ జాతీయాధ్యక్షుడిగా అమిత్ షా పేరు ఖరారు అయిన నేపథ్యంలో దీనిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అమిత్ షాకు ఒక హిందుత్వ వాదిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కావడానికి తగిన అర్హతలున్నాయి. గుజరాత్ తో మొదలై.. యూపీలో మొన్నటి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన హిందుత్వ వాదాన్ని అస్త్రంగా చేసుకొని తన సత్తాను చాటాడు. యూపీలో భారతీయ జనతా పార్టీ స్వీప్ చేయడానికి ముఖ్య కారణం అమిత్ షా అనే చెప్పుకోవాలి. ఎన్నికలకు ఏడాది ముందు అక్కడ అడుగు పెట్టిన అమిత్ షా మొత్తం పరిస్థితిని మార్చి వేశాడు. అయితే అమిత్ షాను జాతీయాధ్యక్షుడిగా నియమించడం ద్వారా బీజేపీ ఒక విధంగా విమర్శల పాలయ్యే అవకాశమూ ఉంది.అమిత్ షాపై ఎన్నికల సమయంలో గుజరాత్ లో అడుగు పెట్టకూడదన్న నిషేధం కూడా ఉండింది. మరి జాతీయాధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తిపై అలాంటి నిషేధాజ్ఞాలు ఉండటం విమర్శలకు ఆస్కారం ఇస్తుంది. అయితే పార్టీ పరంగా మాత్రం అమిత్ షా నియామకం వల్ల బీజేపీకి కొత్త బలం వస్తుందని చెప్పవచ్చు. ఇది వరకూ కూడా హిందుత్వ జాతీయ వాదులే బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. వారితో పోల్చుకొంటే అమిత్ షా కొంత అతివాది అని స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే ఈయన నియామకం ద్వారా స్పష్టమవుతున్న మరో అంశం ఏమిటంటే.. పార్టీపై మోడీ మార్కు! మోడీ అనుచరుడిగా పేరపొందిన అమిత్ షా జాతీయాధ్యక్షుడిగా ఉండటం వల్ల పార్టీ పూర్తిగా మోడీ సంస్థగా మారిపోయే అవకాశం ఉంది. గుజరాత్ లెవల్లోనే షా అంటే.. అతడు మోడీ ఆత్మగా పేరు పొందాడు. మరి ఇప్పుడు ఆయన పార్టీ జాతీయాధ్యక్షుడు కావడం కూడా మోడీ చలవేనని చెప్పవచ్చు.దీంతో బీజేపీ పూర్తిగా మోడీ కనుసన్నల్లోని పార్టీగా మారే అవకాశం ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: