తెలంగాణ సీఎం కేసీఆర్ స్థానికతపై కొత్ర నిబంధనలు పెడుతూ సీమాంధ్రప్రజలను సతాయిస్తున్న సమయంలో ఎట్టకేలకు చంద్రబాబు ఈ విషయంపై నోరు తెరిచారు. కేసీఆర్ ఇటీవల ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో తెలంగాణ పిల్లలకే బోధనం ఇస్తాం.. ఆంధ్ర పిల్లలకు ఇవ్వం అని కొర్రీలు పెడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఫీజు రీఎంబర్స్ మెంట్ కోరుకుంటున్న విద్యార్థులు 1956కు ముందు నుంచే వారి కుటుంబం ఇక్కడ ఉంటున్నట్టు సర్ఠిఫికెట్ చూపించాలని నిబంధన విధించాడు. ఈ నిబంధన కారణంగా.. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో నాలుగు దశాబ్దాల క్రితం నుంచి వచ్చి స్థిరపడిన ఆంధ్రుల పిల్లలు బోధనానికి నోచుకోరు. ఇది కేవలం వలస వచ్చిన సీమాంధ్రుల పిల్లలను ఇబ్బంది పెట్టేందుకేనని.. ఒక రకంగా ఇది కక్ష సాధింపేనని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశంపై చంద్రబాబు స్పందించారు. స్థానికత విషయంలో ఇప్పటివరకూ ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆరు సూత్రాల పథకాలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ఐదేళ్లు ఉంటే చాలు గ్రీన్ కార్డు హోల్డర్ అవుతున్నారని.. అలాంటి.. తోటి తెలుగువారి పట్ల వివక్ష చూపడం తగని సూచించారు. ఏపీ నుంచి కర్ణాటకకు వెళ్లిన కమ్మ, రెడ్డి కులాలకు కూడా అక్కడ బీసీ హోదా కల్పించి.. అదనపు ప్రయోజనాలు కల్పిస్తున్నారని చంద్రబాబు వివరించారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న భావోద్వేగాలను పాజిటివ్ గా ఉపయోగించుకోవాలని.. నెగిటివ్ గా ఉపయోగించుకుంటే.. ఇరు ప్రాంతాలు నష్టపోతాయని కేసీఆర్ కు చంద్రబాబు గీతోపదేశం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా జాగ్రత్తపడాలని కేసీఆర్ కు చంద్రబాబు సూచించారు. అది అంతిమంగా తెలంగాణకే నష్టం చేకూరుస్తుందని హితవు పలికారు. ఎట్టకేలకు చంద్రబాబు స్థానికత అంశంపై స్పందించినా.. ఆయన మరీ ఆచితూచి మాట్లాడారన్న విమర్శ వినిపిస్తోంది. చంద్రబాబు మాటల ద్వారా హైదరాబాద్ లోని సీమాంధ్రులో ఏమాత్రం భరోసా వ్యక్తం కాలేదని అంటున్నారు. కేసీఆర్ కు నీతు వల్లించడం ద్వారా ఉపయోగం ఉండబోదని.. సీమాంధ్ర విద్యార్థుల తరపున తెదేపా న్యాయపోరాటం.. అవరసరమైతే వీధి ప్రదర్శనలు వంటి నిర్వహించడం ద్వారానే ఒత్తిడి తీసుకురాగలని విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: