మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ అంతటా టీఆర్ఎస్ హవా నడిచింది. ఊహించని రీతిలో దక్షిణ తెలంగాణలోనూ కారు జోరు కొనసాగింది. కానీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం అంతగా కేసీఆర్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. పై పెచ్చు శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాల్లో టీడీపీ రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచింది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి అరికెపూడి గాంధీ డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ప్రభంజనం వీచినా... ఇక్కడి వాళ్లు తనకు భారీ ఓటమి కట్టబెట్టడం పై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారా...? అవుననే అంటున్నారు టీడీపీ సీమాంధ్ర నేతలు. హైదరాబాద్ నగరంలో 60 వేల అక్రమ నిర్మాణాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. అలాంటప్పుడు కేవలం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అక్రమ కట్టడాలనూ మాత్రమే ఎందుకు కూలుస్తున్నారు...? మిగతా చోట్ల ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించిన ఇక్కడి ప్రజలను భయపెట్టడానికే కేసీఆర్ కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని విస్మరించి... కూల్చివేయడం పగపట్టడమేనని అన్నారు. నవ తెలంగాణ నిర్మిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం... శిథిలాలను మిగిలుస్తోందని చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ కు మూడంటే మూడే ఎమ్మెల్యే సీీట్లు రావడం ప్రజానీకానికి శాపంగా మారిందని ఎద్దేవా చేశారు. ఏపీఎన్జీఓల భూములు, సినీ పరిశ్రమ భూములను వెనక్కి తీసుకోవడం కూడా సరికాదని టీడీపీ అభిప్రాయపడింది. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్లకు భూములిస్తే... మరో తెలంగాణ ముఖ్యమంత్రి వాటిని లాక్కోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: