నరేంద్ర మోడి ప్రభుత్వం రూపొందించిన వార్షిక బడ్జెట్‌‌పై ప్రతిపక్ష పార్టీలు పెదవి విరిచాయి. పేదల వ్యతిరేక, నిరాశ పరిచిన బడ్జెట్‌గా విపక్షాలు బడ్జెట్‌ను అభివర్ణించాయి. ఎన్నో ఆశలు పెంచి, ఊరించిన బడ్జెట్‌‌‌ అంఛనాలను అందుకోలేకపోయిందని, బీజేపి ప్రభుత్వం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందని విపక్ష పార్టీ సభ్యులు అన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆదాయ పన్ను పరిమితిని రూ.50వేలకు మాత్రమే పెంచడం సరిపోదని ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. 'ఆమ్ ఆద్మీ'కి ఎన్డీఏ బడ్జెట్‌ వల్ల పెద్దగా కలిగిన లాభం ఏమీ లేదని, పేదలకు ఏ మాత్రం న్యాయం జరగలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు పెదవి విరిచారు. పన్నుల రాయితీలు, మినహాయింపులు కార్పొరేట్, వాణిజ్య సంస్థలకు మేలు చేసేవిగా ఉన్నాయని వారన్నారు. ఓ వైపు గత ప్రభుత్వం అనుసరించిన పన్నులనే కొనసాగిస్తామని ప్రకటిస్తూనే మరో వైపు పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలకు మేలు కలిగేలా రాయితీలు ఇచ్చారని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. సంక్షేమ పథకాలకి సంబంధించి బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం సరికాదని అన్నారు. కేవలం పన్నుల్లో రాయితీలు ఇవ్వడం వల్ల ప్రస్తుత తరుణంలో ఏ మాత్రం ఉపయోగపడదని ఆయన అన్నారు. మరో కాంగ్రెస్ నేత అమరేందర్ సింగ్ మాట్లాడుతూ పేదలకు సంబంధించినంత వరకు ఇది ఏ మాత్రం ఉపయోగకరంగా లేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: