కేంద్ర బడ్జెట్ లో పన్ను రేట్ల తగ్గించడంతో అనేక వస్తువులు ధరలు తగ్గనున్నాయి. సో... బ్రాండెడ్ దుస్తులు వేసుకోవచ్చు. అందాన్ని ఇనుమడింపజేసుకునేందుకు సౌందర్య సాధనాలు వాడుకోవచ్చు. మంచి చెప్పులు కూడా వేసుకుని అలా సరదాగా షికారుకు వెళ్ళి.. రెడీ టూ ఈట్ ఫుడ్ హ్యాపీగా తినొచ్చు. అయితే పొరపాటుగా అయినా సిగరెట్ జోలికి వెళితే మాత్రం.. మీరు బుక్కయిపోవడం ఖాయం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌ లో వివిధ వస్తువులపై పన్నులు, సుంకాలను తగ్గించారు. కొన్నింటిపై కస్టమ్స్ డ్యూటీని ఎత్తివేయడంతో.. చాలావాటి ధరలు తగ్గే అకాశాలు ఉన్నాయి. కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేయడంతో కలర్ టీవీలు, 19 అంగుళాల ఎల్ఈడీ, ఎల్‌సీడీ టీవీలుల ధరలు తగ్గే అవకాశం ఉంది. కంప్యూటర్ మానిటర్లు, సిమెంట్, స్టీల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. పాదరక్షలపై ఎక్సైజ్ డ్యూటీ సగానికి సగం... 12 నుంచి 6 శాతం తగ్గించడంతో రూ.500 నుంచి వెయ్యి రూపాయల లోపు ఉన్న వాటి ధరలు కూడా తగ్గనున్నాయి. ట్యూబ్ లైట్లు, మొబైల్ ఫోన్లు, సబ్బులు, సౌందర్య సాధనాలు, బ్రాండెడ్ దుస్తుల ధరలు తగ్గనున్నాయి. రెడీ టూ ఈట్ ఫుడ్స్, నూనెలు, పెట్రో కెమికల్స్, సిమెంట్, ఐరన్, సోలార్ ప్యానెల్స్, క్రీడా వస్తువులు ధరలు కూడా తగ్గనున్నాయి. ఇక దేశీయంగా ఉత్పత్తి చేసే ఎలక్ట్రానికి ఉత్పత్తులపై పన్నులు తగ్గించడంతో.. వాటి ధరలు తగ్గనున్నాయి. అయితే విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు మాత్రం మోత మోగనున్నాయి. మరోవైపు కెమికల్స్, పెట్రో కెమికల్స్ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఇంకా ఈ బుక్ రీడర్స్. ల్యాప్ టాప్ లు, టాబ్లెట్ల ధరలు తగ్గనున్నాయి. హెచ్ఐవి, ఎయిడ్స్ కి సంబంధించిన మందుల ధరలు కూడా తగ్గనున్నాయి. పన్ను రేట్లు, సుంకాలు పెంచడంతో కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. దిగుమతి చేసుకున్న స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులపై సుంకాన్ని పెంచడంతో వాటి ధరలు పెరగనున్నాయి. శీతల పానీయాల పైన పన్ను పెంచడంతో... కూల్ డ్రింక్స్ ధరలు పెరిగే అవకాశముంది. సోడాలపై కూడా పన్ను రేటు పెంచడంతో వాటి ధరలూ పెరగనున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిగరెట్ల పై పన్నును 11 శాతం నుంచి 72 శాతానికి పెంచారు. పాన్ మసాలా, గుట్కాల మీద కూడా పన్నును 60 శాతానికి పెంచారు. దీంతో సిగరెట్ ప్యాకెట్లు, పాన్ మసాలాలు, గుట్కాల ధరలన్నీ అత్యంత భారీగా పెరగబోతున్నాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ఈ చర్యకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. అయితే.. పన్ను రేటు తగ్గించడంతో అగ్గిపెట్టెల ధరలు మాత్రం తగ్గనున్నాయి. ధరలు తగ్గేవి: కలర్ టీవీలు 19 అంగుళాల ఎల్ఈడీ, ఎల్‌సీడీ టీవీలు కంప్యూటర్ మానిటర్లు సిమెంట్, స్టీల్ రూ.500-1,000 లోపు ఉన్న పాదరక్షలు ట్యూబ్ లైట్లు, మొబైల్ ఫోన్లు సబ్బులు, సౌందర్య సాధనాలు, బ్రాండెడ్ దుస్తులు రెడీ టూ ఈట్ ఫుడ్స్, నూనెలు, పెట్రో కెమికల్స్ సిమెంట్, ఐరన్, సోలార్ ప్యానెల్స్, క్రీడా వస్తువులు దేశీయ ఎలక్ట్రానికి ఉత్పత్తులు ఈ బుక్ రీడర్స్. ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు హెచ్ఐవి, ఎయిడ్స్ ఔషధాలు ధరలు పెరిగేవి: విదేశీ స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులు శీతల పానీయాలు, సోడాలు సిగరెట్లు పై పన్ను 11 నుంచి 72 శాతానికి పెంపు పాన్ మసాలా, గుట్కాలపై పన్ను 60 శాతానికి పెంపు

మరింత సమాచారం తెలుసుకోండి: