మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నోరు విప్పాడు! సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ప్రధాని పీఠం నుంచి వైదొలిగి తీరిగ్గా కూర్చొన్న ఆయన ఎట్టకేలకూ పలికాడు! మోడీప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఆయన మాట్లాడాడు! ఒక ఆర్థిక వేత్తగా, మాజీ ప్రధాని గా గుర్తింపు ఉన్న ఆయనకాంగ్రెస్ నేత హోదాలో మాట్లాడినట్టున్నాడు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు దశాదిశ లేదని తేల్చిపారేయడమే అందుకు రుజువు! ఒకవైపు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీనేమో బడ్జెట్ లాండ్రీ లిస్టింగ్ లా ఉందని తేల్చేశాడు, కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ నేమో ఇది తమ యూపీఏ విధానాలకు కొనసాగింపుగా ఉందని వ్యాఖ్యానించింది. రాజకీయంగా తమ వైరి పక్షం ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి వాళ్లు అలా మాట్లాడటం రొటీనే అనుకోవాల్సి ఉంటుంది! ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్లు బడ్జెట్ ప్రవేశపెడితే బీజేపీ వాళ్లు ఇదే తరహా ప్రకటన చేసేవారు! బడ్జెట్ ను చిత్తు ప్రతిగా, బడ్జెట్ అంటే అది అర్థం లేని లెక్క అని అభిప్రాయపడేవాళ్లు. ఇప్పుడేమో ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి బీజేపీలోని ప్రతి నాయకుడూ, బీజేపీకి మిత్రపక్షం అయిన చంద్రబాబు కూడా బడ్జెట్ అమోఘం అని అంటున్నారు. ఈ అభిప్రాయాలకు భిన్నంగా బడ్జెట్ ప్రసంగం మొత్తం డొల్ల అని చెప్పే బాధ్యతను తీసుకొన్నారు కాంగ్రెస్ వాళ్లు. ఇటువంటి నేపథ్యంలో మన్మోహన్ సింగ్ తన అభిప్రాయాన్ని చెప్పడమే అన్నింటికన్నా ఆసక్తికరమైన అంశం. పదవి నుంచి దిగిపోయాకా.. ఇక రాజకీయాలకు దూరంగా ఉండిపోతాడు, మాజీ ప్రధానిగా ఇంటికే పరిమితం అవుతాడని అందరూ భావిస్తున్న నేపథ్యంలో మన్మోహన్ మోడీ పాలన గురించి ఈ విధంగా పెదవి విరిచాడు. మరి మన్మోహనుడి అభిప్రాయానికి విలువ ఉంటుందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: