నేనిక్కడే... నా మనసెక్కడో... అంటూ భద్రాచలం రాములోరు పాడుకోవాల్సి వస్తోంది ఇప్పుడు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు నేల ఎంత మందిని సంతోషానికి, మరెంత మందిని బాధకు గురి చేసిందో కానీ... భద్రాద్రి రామయ్యను మాత్రం అయోమయంలో పడేసింది అనడంలో సందేహం లేదు. గోదావరీ తీరాన భద్రాచల ఆలయంలో కొలువైన రాముల వారు తెలంగాణ పరిధిలోకి వస్తుండగా... ఆ రామాలయానికి ఉన్న స్థిరాస్థులన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లడమే ఇందుకు కారణం. భద్రాచలం రామాలయానికి అనేక ప్రాంతాల్లో స్ధిరాస్తులున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిసి సుమారు 1250 ఎకరాల భూములూ ఉన్నాయి. వీటిలో ఎక్కువగా 890 ఎకరాల భూమి భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న పురుషోత్తమపట్నంలోనే ఉంది. దీంతోపాటు భద్రాచలం మండలంలోనే ఉన్న మనుబోతుల చెరువు, చౌడవరం, కాపవరం, పినపల్లి, రాచగొంపల్లి గ్రామాలతోపాటు బూర్గంపాడు మండలంలోని సీతారామనగరంలోనూ ఆలయ భూములున్నాయి. ఇవే కాకుండా విశాఖపట్నం, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాతోపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ దేవస్థానం భూములున్నాయి. రాములోరికి భారీగానే భూములున్నా... ఇప్పుడు వాటితోనే ఆయనకు చిక్కులు వచ్చి పడ్డాయి. పోలవరం నిర్మాణం సాఫీగా సాగేందుకు తెలంగాణలోని ముంపు ప్రాంతాన్ని ఏపీలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. దీంతో భద్రాచలం డివిజన్ లోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం (భద్రాచలం పట్టణం మినహా) మండలాలతోపాటు పాల్వంచ డివిజన్ లో ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు, బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలూ సీమాంధ్రలో కలిసిపోయాయి. భద్రాచలంకు ఆనుకుని ఉన్న పురుషోత్తమపట్నం కూడా ఏపీ పరిధిలోకి వెళ్లింది. దీంతో రాముల వారి ఆలయం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉండగా... ఆయనకున్న 1250 ఎకరాల్లో 1220 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లింది. భద్రాచలంలోని రామాలయంతోపాటు ఖమ్మం జిల్లాలోనే దుమ్ముగూడెం మండలంలో 20 ఎకరాలు, అశ్వాపురం మండలంలో 6 ఎకరాలు, ముల్కలపల్లి మండలంలో ఉన్న 4 ఎకరాల భూమి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రాములోరికి ఉన్న ఆస్తులు. ఆలయమిక్కడ ఉండి... ఆస్తులు అక్కడికి వెళ్లడం వల్ల భవిష్యత్తులో ఆలయ అభివృద్ధి పై ప్రభావం చూపే అవకాశాలూ లేకపోలేదు. కోట్ల రూపాయల విలువ చేసే ఆలయ భూముల వల్ల ప్రస్తుతం దేవస్థాన కమిటీకి ప్రతి ఏటా 20 లక్షల రూపాయల దాకా ఆదాయం సమకూరుతోంది. ఇక ముందు ఈ సొమ్ము రాష్ట్రం దాటి రావాల్సి ఉంటుంది. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతులూ తప్పనిసరి. ఇన్ని చిక్కులు నెలకొన్న నేపథ్యంలో... కనీసం రాముడి ఆస్తులు అధికంగా ఉన్న పురుషోత్తమపట్నం వంటి గ్రామాలనైనా తెలంగాణలో ఉంచాలనే డిమాండ్ బలంగా వినిపించింది. ఇప్పటికే పురుషోత్తమపట్నంలో ఆలయానికి సంబంధించిన అనేక నిర్మాణాలు సైతం కొనసాగుతుండడం మరో కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: