పోలవరం బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. ఇక ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిసినట్టేనని సీమాంధ్రులు సంబరపడుతున్నారు. ఇక పోలవరం కల త్వరలోనే నెరవేరబోతోందని ఆశపడుతున్నారు. మూడేళ్లలో పోలవరం కట్టేస్తామని తెలుగుదేశం మంత్రులు కూడా అందివచ్చిన వాగ్దానాలు అలవోకగా గుప్పిస్తున్నారు. అయితే ఇక్కడ టెక్నికల్ గా ఓ ఇష్యూ ఉంది. ఈ బిల్లు ఇంకా రాజ్యసభ ఆమోదం పొందలేదు. రాజ్యసభ ఆమోదం పొందాక.. రాష్ట్రపతి ఆమెద ముద్రవేశాక అప్పుడు అధికారికంగా ముంపు మండలాలు.. సీమాంధ్రలో కలుస్తాయి. మరి పోలవరం బిల్లు..లోక్ సభలో ఆమోదం పొందిన తీరు చూశాక..ఇక ఈ తూతూమంత్రం ప్రక్రియ జరగడమన్నది లాంఛనప్రాయమేనని చాలామంది విశ్వాసం. ఈ నేపథ్యంలో పోలవరం బిల్లును రాజ్యసభలోనైనా అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీ తీవ్రంగా అడ్డుపడుతున్నారు. ఔను మీరు చదివింది నిజమే.. ఏపీ ఎంపీ ఎందుకు పోలవరాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు అనుకోకండి. ఆయన టెక్నికల్ గా మాత్రమే ఏపీ ఎంపీ. నిజానికి ఆయన వీర తెలంగాణవాది. ఆయనే కె. కేశవరావు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ అయిన ఈ మాజీ కాంగ్రెస్ నేత.. పోలవరానికి వ్యతిరేకంగా రాజ్యసభలో మద్దతు కూడ గట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  టీఆర్ఎస్ తెలంగాణ అనే ఒక చిన్న రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ. జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నాయకులతో తమకు ఉండే సంబంధాలు తక్కువ. అందుకే కాంగ్రెస్‌ ఎంపీగా అదే రాజ్యసభలో సుదీర్ఘ అనుభ వం ఉన్న కేశవరావు మీద టీఆర్ఎస్ ఎక్కువగా ఆధారపడుతోంది. పార్టీ తనపై పెట్టిన తొలి బాధ్యతను సక్రమంగా నెర వేర్చడానికి ఢిల్లీలో కేకే విపరీతంగా శ్రమిస్తున్నారట.. ఆయన ఇతర పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులను కలవడంలో చాలా బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల సహాయం కోసం ప్రయత్నిస్తున్నారట. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీలు ఎవరైనా ఉంటే వారు ఈ బిల్లును వ్యతిరేకించవచ్చు గానీ మిగిలిన కాంగ్రెస్‌ సభ్యులు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరం. ఇప్పటికే కాంగ్రెస్ పోలవరం బిల్లు విషయంలో తటస్తంగా ఉండాలని నిర్ణయం తీసేసుకుంది. లోక్ సభలోనూ ఆ పార్టీకి చెందిన నేతలు.. తమ ప్రాంతాలకు అనుకూలంగా వ్యవహరించారు. అదే సీన్ రాజ్యసభలోనూ రిపీటయ్యే ఛాన్సుంది. కేకే.. కాంగ్రెస్‌ వారి ద్వారా ఇతర పార్టీల వారికి కూడా ఫోన్లు చేయించి బిల్లు గురించి చెబుతున్నారట. కేకే ఎంతగా ప్రయత్నించినా.. అది దింపుడు కల్లం ప్రయత్నాలేనని.. రాజ్యసభ ఆమోదం మంచినీళ్ల ప్రాయమని సీమాంధ్ర ఎంపీలు ధీమాగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: