విజయవాడలో ఏపీఎన్జీవోలు ముఖ్యమంత్రిని అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగానే సాగినా.. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రసంగం మాత్రం సభలో కాసేపు కలకలం సృష్టించింది. ఇప్పటివరకూ ఏపీ మంత్రులు పెద్దగా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడం లేదు. అందులోనూ మీడియా ఫోకస్ ఉన్న సందర్భంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. వివాదాలు రాకుండూ జాగ్రత్తపడుతున్నారు. విజయవాడ సభలో మాత్రం ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఘాటు వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ నేతల వైఖరిని తీవ్రంగా విమర్శించారు.  తెలంగాణ నేతలు ఆంధ్రులపై ద్వేషం పెంచుకుంటున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు కేఈ. హైదరాబాద్ లో అన్యాయంగా ఆంధ్రుల ఇళ్లు కూలగొడుతున్నారని.. భూములు దున్నుతున్నారని ఆయన ఆరోపిం చారు. తెలంగాణ వాళ్లు ఆంధ్రవాళ్లను దుర్మార్గంగా, అన్యాయంగా హింసిస్తున్నారని అన్నారు. హైదరాబాదులో పనిచేస్తున్న వారిని ఎప్పుడెప్పుడు తరుముదామా అని తెలంగాణవాళ్లు చూస్తున్నారని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సీమాంధ్రుల రాకతోనే హైదరాబాద్ వృద్ధి చెందిందని... చంద్రబాబు ప్రత్యేక నైపుణ్యం వల్లే హైదరాబాదుకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు. బిల్‌క్లింటన్‌, బిల్‌ గేట్స్ హైదరాబాద్‌ వచ్చి అభివృద్ధి చూసి ఆశ్చర్యపోయారన్నారు. అంతే కాదు.. పోలవరాన్ని తెలంగాణవాదులు అడ్డుకోవడంపై కూడా ఘాటుగానే స్పందించారు కేఈ. మేం బంగారం లాంటి హైదరాబాద్ నే వదులుకున్నాం.. మీరు 10 మండలాలు వదులుకోవడం ఓ లెక్కా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ వాళ్లు ఆశ్చర్యపోయేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అదే వేదికపై మరో వివాదానికి తెర తీశారు కేఈ. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేతలు.. ఇందిరా సాగర్‌ అని పేరు పెట్టారని, దాన్ని తాము అంగీకరించబోమని అన్నారు. భద్రా ద్రిరాముడు ఉన్న చోట తారకరాముడు ఉండాలని, ఆ పేరు పెట్టాలని ఆయన అన్నారు. సాధారణంగా సౌమ్యంగా కనిపించే కేఈ ఘాటుగా ప్రసంగించడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: