ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా మోడీ అంతర్జాతీయ వేదికపై కనిపించబోతున్నారు. అభివృద్ధిబ్యాంకు ఏర్పాటు, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలే అజెండాగా జరిగే బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సదస్సు లో పాల్గొనేందుకు మోడీ బ్రెజిల్‌ బాటపట్టారు. రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్‌, జీజిన్‌పింగ్‌ వంటి దిగ్గజాలతో ప్రధాని మోడీ సమావేశమవుతారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరుదేశాల అధినేతలతో చర్చిస్తారు. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి నిర్మలాసీతారామన్‌, జాతీయ భద్రతా సలహాదారు  ఏకే దోవల్‌తో పాటు విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్‌ మోడీతో వెళ్తున్న బృందంలోఉన్నారు. బ్రిక్స్‌ దేశాల మధ్య ఆర్ధిక బంధాన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పటికే దేశాలు నిర్ణయించాయి. ఇందుకోసం వంద బిలియన్‌ డాలర్ల నిధితో ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలితో పాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల్లో సంస్కరణలు కోరే అంశంపైనా సభ్యదేశాలు చర్చించనున్నాయి. డర్బన్‌లో గతేడాది జరిగిన సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు తీరుపైనా దేశాధినేతలు సమీక్షించనున్నారు. శిఖరాగ్ర సమావేశానికి ముందు సభ్య దేశాల వ్యాపారవేత్తలతో జరిగే బ్రిక్స్‌ వ్యాపార సదస్సులోనూ ప్రధాని మోడీ పాల్గొంటారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌జుమా, బ్రెజిల్‌ అధ్యక్షురాలు దిల్మారోసెఫ్‌తో ఆయన సమావేశమవుతారు. జూలై 16న దక్షిణ అమెరికా దేశాధినేతలతో మోడీ భేటీ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: