తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి ఒకింత ప్రత్యేకమైన వ్యక్తి. ప్రత్యర్థులను విమర్శించడంలోనైనా, తమ విధానాల విషయంలో చాలా కచ్చితంగా మాట్లాడతాడు, కఠినంగా మాట్లాడతాడు. జగన్ పై కత్తులు దించినట్టుగా మాట్లాడతాడాయన.. అదే సమయంలో తాను అంతగా మాట్లాడినా దక్కిన ప్రతిఫలం ఏమీ లేదని కూడా స్పష్టం చేస్తాడు. తెలుగుదేశంలో తను కోరిందేదీ దక్కలేదని అంటాడు. బహుశా తన కులం కూడా అందుకు అడ్డమేమోనని ఆయన వ్యాఖ్యానిస్తాడు. తెలుగుదేశంలో పార్టీలో కమ్మ ప్రాబల్యం అతిగా ఉందని, అలాగే వెలమలు కూడా తెలుగుదేశాన్ని నిర్దేశిస్తున్నారని ఆ రెండు కులాల మధ్య తెలుగుదేశంలో రెడ్లను పట్టించుకొనే నాథుడే లేకుండా పోయాడని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు. తెలుగుదేశం రెడ్లు ద్వితీయ శ్రేణి పౌరులేనని మీడియా ప్రతినిధుల ముందు రేవంత్ రెడ్డి అనేక సార్లు వ్యాఖ్యానిస్తూ వచ్చాడు. ఇటువంటి తరుణంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యానాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవి చంద్రబాబు గురించినవి కావడం విశేషం. ఇటీవల జరిగిన ఆటా 13 వ కాన్వకేషన్ కు హాజరైన రేవంత్ రెడ్డి అక్కడ ప్రసంగించాడు. ఆ ప్రసంగంలోని కొన్ని లైన్లు ఇలా ఉన్నాయి.." మా నాయకుడు ఏమైనా హెరిటేజ్ షేర్లు అమ్మి హామీలను నెరవేరుస్తానని చెప్పాడా? డబ్బులొస్తే అమలు చేస్తాం, లేకుంటే లేదు. ఎన్నికల్లో గెలవాలంటే ఆల్ ఫ్రీ అనాలి. అందుకే అన్నాం. ప్రజలు మమ్మల్ని నమ్మారు. మాకు ఓటు వేశారు. కానీ ఇప్పుడు హామీలను అమలు చేయాలని లేదు. ప్రజలు కూడా హామీలన్నీ అమలు కావాలని కోరుకోవడం లేదు. అసలు రుణమాఫీ అనేది సాధ్యం అయ్యేది కాదు..'' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు! మరి రేవంత్ వ్యాఖ్యలు కుండబద్ధలు కొట్టినట్టుగానే ఉన్నా... ఇవి హామీలకు ఆశపడి ఓటేసిన జనాలను చెప్పుతో కొట్టినట్టుగా కూడా ఉన్నాయని చెప్పకతప్పదు!

మరింత సమాచారం తెలుసుకోండి: