దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఢిల్లీ బిజెపి అధ్యక్షులు సతీష్‌ ఉపాధ్యారు ఆదివారం తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన పార్టీ పటిష్టతకు ప్రాధాన్యతను ఇస్తామని ప్రకటిం చారు. అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకుం టుందని , ఇప్పుడున్న పరిస్థితిలోనే ఇతర పార్టీల మద్దతుతోనే బిజెపి ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, అయితే తాజాగా ఎన్నికలకు వెళ్లాలనేదే తమ పార్టీలోని అత్యధికుల ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలందరినీ ఈ అంశంపై సంప్రదిస్తున్నామని, వారి వైఖరికి అనుగుణంగా నిర్ణయం తీసుకుని, కేంద్ర నాయకత్వా నికి తెలియచేస్తామని ఉపాధ్యారు చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఇప్పుడు సుక్షప్తావస్థలో ఉంది. ఆమ్‌ ఆద్మీపార్టీ అధికారం నుంచి వైదొలిగిన తరువాత ఢిల్లీ అసెంబ్లీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఓ దశలో కాంగ్రెస్‌ నుంచి తిరిగి మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆప్‌ వర్గాలు ప్రకటించాయి. కానీ కాంగ్రెస్‌ నుంచి సరైన సంకేతాలు రాకపోవడంతో ఈ ప్రతిపాదనను వారు విరమించుకున్నారు. ఇక అత్యధిక స్థానాలు ఉన్న బిజెపి ఓ దశలో ఆప్‌లో చీలికతో అధికారంలోకి రావాలని యత్నించినా, దాని వల్ల ప్రతికూలత ఏర్పడుతుందనే భయంతో ఎన్నికలకే వెళ్లాలని భావిస్తోంది. ఢిల్లీ బిజెపి నేతలు ఇద్దరు ఇప్పుడు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. ఎంపీలు, పార్టీ సీనియర్లతో చర్చించి కార్యకర్తల మనోభావాలను తెలుసుకుని ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఉపాధ్యారు చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కు అత్యంత సన్నిహితులైన ఉపాధ్యారు తమ పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని నమ్మకంతో చెప్పారు. ఎన్నికల నిర్వహణ అనేది సమిష్టి విధాన నిర్ణయం అని, దీనిలో రెండుమూడు అంశాలు ఉంటాయని, పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం ఒక్కటైతే, గవర్నర్‌ నుంచి దీనికి సంబంధించి అనుకూల నిర్ణయం రావడం మరోటి అని, ఆ తరువాత ఎన్నికల సంఘం స్పం దన కీలకమని బిజెపి నేత తెలిపారు. అయితే తమ పార్టీ నిర్ణయం నాన్చకుండా త్వరలోనే తీసుకుంటారని వెల్లడించారు. అయితే త్వరితగతిన ఎన్నికల వల్ల ఇబ్బం దులు ఉంటాయని, దీనికి బదులుగా ఇతర పార్టీల మద్దతు తో వీలైనంత వరకు ప్రభుత్వ ఏర్పాటుకు మార్గాలు వెతకాల్సి ఉందని బిజెపిలోని కొందరు నేతలు కోరుతున్నారు. అయితే ఈ ధోరణితో ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందనేది అనుమానాస్పదమే అని ఇతరులు పేర్కొంటున్నారు. తాజా ఎన్నిలకు వెళ్లడం వల్ల ప్రజల వద్దకు వెళ్లడానికి వీలవు తుందని, ఆప్‌తో పాటు కాంగ్రెస్‌ను కూడా ఎండగట్టడానికి సాధ్యమవుతుందని బిజెపిలోని సీనియర్‌ నాయకులు కొందరు భావిస్తున్నారు. అయితే ఢిల్లీలో ఎన్నికల నిర్వహణ గురించి బిజెపి కేంద్ర నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. తొందరపడి నిర్ణయం తీసుకోరాదని, నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించడం ద్వారానే ఓటర్లలో సముచిత సంకేతాలు వెళ్లుతాయని బిజెపి నాయకత్వం భావి స్తోంది. ఉపాధ్యారు శనివారమే బిజెపి స్థానిక అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టారు. నగరంలో ఇప్పుడు విద్యుత్‌ చార్జీల అంశం కీలకంగా ఉందని, దీనిపై తాము తీవ్రస్థాయిలోనే స్పందిస్తామని ఉపాధ్యారు విలేకరులకు తెలిపారు. తమ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే, విద్యుత్‌ చార్జీలను 30 శాతం వరకూ తగ్గిస్తామని, నీటికొరత లేకుండా చూస్తామని, శాంతిభద్రతలపై తగు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: