దశాబ్దాల తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న బోనాల్ పండుగ అత్యంత ఉత్సహభరిత వాతావరణంలో జరుగుతోంది. కేసీఆర్ కూడా బోనాల్ ను రాష్ట్రపండుగగా గుర్తించి.. అధికారికంగా పండుగ నిర్వహిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఇదే బోనాల్ పండుగ.. సమాజంలో శతాబ్దాల తరబడి పాతుకుపోయిన మూఢనమ్మకాలను గుర్తు చేస్తోంది. బోనాల పేరుతో సామాజిక దురాచారమైన జోగినీ, మాతమ్మ, శివసత్తి వ్యవస్థ కొనసాగింపును మహిళాసంఘాలు, దళిత సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. జోగినీ లంటే దేవుడికి ఎస్సీ, బీసీ ఆడపిల్లల్ని ముఖ్యంగా మాదిగ అనుబంధ కులాల ఆడపిల్లలను అంకితం చేస్తారు. ఆ తర్వాత ఆ ఆడపిల్ల జోగిని అవుతుంది. అంటే.. ఎవరినీ పెండ్లి చేసుకోకుండా దేవుడి భార్యగా ఉంటుంది. ఆ పేరుతో ఆమె ఊరంతటికీ లైంగిక ఆస్తిగా మారుతుంది. అత్యంత అమానవీయమైన ఈ జోగినీ వ్యవస్థ నిర్మూలన కోసం చట్టాలు వచ్చినా, కమిషన్లు వేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. బోనాల పండుగ సందర్భంగా వేలాదిగా జోగమ్మలు, మాతమ్మలు, శివసత్తులను వినియోగిస్తారు. బోనాల ఉత్సవాల్లో రంగమెక్కి భవిష్య వాణి చెప్పేదంతా జోగినీలే. ఈ జోగినీలంతా సామాజికంగా అంటరాని మహిళలే. ఇటీవల బల్కంపేట ఉత్సవాలకు లక్ష మంది శివసత్తులు హాజరయ్యారని తెలుస్తోంది. అంటే.. ఈ దురాచారం ఎంత విస్తృతంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క జంట నగరాల్లోనే దాదాపు రెండున్నర వేల గుళ్ళల్లో జోగినీ వ్యవస్థ ఉంది. అధికార పీఠం ఎక్కిన కేసీఆర్ మొదటి నుంచి దళితులపై సానుభూతితో ఉన్నారు. వారికి 3 ఎకరాల భూమి ఇప్పించేందుకు కృషి చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ను దళిత అభివృద్ధి శాఖగా మార్చారు. దళితుల కోసం మరెన్నో పథకాలు తెస్తానంటున్నారు. ఈ ఆచారాలపైనా కేసీఆర్ దృష్టిసారిస్తే.. వేల సంఖ్యలో బడుగు వర్గాల మహిళలు కొత్త జీవితం ప్రారంభిస్తారు.. వందల సంఖ్యలో బాలికలు ఈ ఊబిలో దిగకుండా కాపాడినవారవుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి: