వలస వస్తే చేతులు నరికేస్తారా..!? వలస కార్మికుల దయనీయ పరిస్థితిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒడిశాకు చెందిన వలస కూలీల చేతులను ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టర్లు నరికి వేసిన ఘోర సంఘటనపై సుప్రీం మండిపడింది. ఆదిమానవుల కాలంలో కూడా ఇలాంటి ఘోరాలు జరిగి ఉండవనీ.. మనం ఎలాంటి దేశంలో ఉన్నామని ప్రశ్నించింది. ఇలాంటి అమానుషాలను, దేశవ్యాప్తంగా వలస కూలీల దోపిడీని అరికట్టడానికి ఒక జాతీయ విధానం అవసరమని పేర్కొంది. 2013 డిసెంబర్లో ఒడిషాకు చెందిన ఇద్దరు కార్మికుల చేతుల్ని కాంట్రాక్టర్లు నరికేయడంపై అప్పట్లో పత్రికల్లో విరివిగా కథనాలు వచ్చాయి. వీటిపై సుమోటోగా స్పందించిన సుప్రీంకోర్టు.. మహిళల దోపిడీ సహా ఇలాంటి సంఘటనలను అరికట్టడానికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని పేర్కొంది. చట్టాన్ని అమలు చేసే ఏజన్సీలు ఇలాంటి ఘటనల పట్ల కళ్లు మూసుకుని ఉండడానికి వీల్లేదని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించింది. వలస కార్మికులకు సంబంధించి ఒక విధానం అవసరం.. వాళ్లు అనధికారిక కాంట్రాక్టర్ల చేతుల్లో పడకూడదు.. అంటూ ప్రస్తుతానికి ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే తన విచారణను పరిమితం చేస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. సంఘటన జరిగినట్లు అంగీకరిస్తూ, బాధితుల పునరావాసానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ, ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీం కోర్టు పరిశీలించింది. ఒడిశాలో న్యాయం అనేది చనిపోయిన పదంగా కనిపిస్తోందని కామెంట్ చేసింది. చట్టం కింద ఇలాంటి కేసులు ఎన్ని నమోదయ్యాయో కూడా చెప్పి ఉండాల్సిందని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి బెంచ్ వ్యాఖ్యానించింది. వాస్తవ పరిస్థితి గురించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ వివరంగా నివేదిక సమర్పించాలని బెంచ్ ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: