ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు గడిచిపోయాయి... కొత్త ప్రభుత్వ, బాబు పరివారపు వైభోగం ఇంకా హనీమూన్ దశలోనే ఉంది. ఐదు సంవత్సరాల పదవి కోసం పట్టాభిషేకపు మూడ్ లోనే ఉంది బాబు అండ్ కంపెనీ. మరి అప్పడే జగన్ మోహన్ రెడ్డిజనాల మధ్య వెళ్లాడు. ప్రభుత్వం మీద పోరాటంమొదలు పెట్టినట్టుగా ప్రకటించాడు. నెల రోజుల గడువులోగా రైతులకు హామీ ఇచ్చిన రుణమాఫీని చేయకపోతే మరో ప్రజా ఉద్యమమేనని జగన్ వ్యాఖ్యానించాడు. మరి ఇప్పుడు జగన్ విషయంలో జనాలు ఏమనుకొంటున్నారు? గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసినా అధికారాన్ని సాధించుకోలేకపోయిన జగన్ మోహన్ రెడ్డికి అప్పుడే అంత ఓపిక ఎలా వచ్చింది? ముందుగా జగన్ పరిస్థితిని పరిశీలించినట్లైతే... ఎన్నికలకు ఇంకా ఐదేళ్ల సమయం ఉంది. ఇప్పుడప్పుడే గొంతు చించుకోవడం మొదలు పెడితే.. ఐదేళ్ల పాటు ఇలాగే కష్టపడాల్సి ఉంటుంది. అసలుకు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జగన్ ఏదో విధంగా జనాల మధ్యనే ఉన్నాడు. జైల్లో ఉండిన కొన్ని రోజులను మినహాయిస్తే.. జగన్ మోహన్ రెడ్డి చాలా ఉద్యమాలు చేశాడు. అధికారంలోకి వస్తామని ఖాయంగా నమ్మాడు. అయితే ప్రజలు షాక్ నిచ్చారు. మరి ఆ షాక్ తో జగన్ చాలా నిరుత్సాహపడిపోయుండాలి. అధికారం మీద చాలా ఆశలు పెట్టుకొన్నట్టు అయితే... నిరాశ నిస్పృహల్లోకి పడిపోయుండాలి. కానీ బాబుగారి పట్టాభిషేకం జరిగి రెండు నెలలు అయినా కాకముందే.. జగన్ మళ్లీ రోడ్డు మీదకు వచ్చాడు.ఐదేళ్ల వరకూ అధికారం అందే అవకాశం ఏదీ లేదని తెలిసినా.. ప్రజల్లో ఉండటానికే ప్రాధాన్యతను ఇస్తున్నాడు. అంటే దీని ప్రకారం చూసుకొంటే.. ఎన్నికల ఫలితాలు జగన్ ను పెద్దగా నిరాశపరిచింది లేదనుకోవాలి.. ఆయనకు మరో ఐదేళ్లు పోరాడే ఓపిక పుష్కలంగా ఉందనుకోవాలి. ఇక జనాల వ్యూ ఏమిటి? జగన్ మోహన్ రెడ్డి విషయంలో జనాలు ఏమనుకొంటున్నారు.. ఓటేసిన జనాలు అయితే ఒకింత బాధతోనే ఉంటారు. తాము ఓటేసిన జగన్ గెలవలేదు, ఇప్పుడు మళ్లీ పోరాడుతున్న అతడిని చూసి వాళ్లు అభిమానంతోనే ఉంటారు. చంద్రబాబు బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడని, వాటిని నెరవేర్చకపోవడంతో జగన్ మోహన్ రెడ్డి పోరుబాట పట్టాడని, జగన్ కు తమ మద్దతు ఉంటుందని వారు అంటున్నారు. మరి బాబు ఇచ్చిన హామీలపై ఆశపెంచుకొని తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ల పరిస్థితి ఏమటి? బాబు రుణమాఫీ చేస్తాడని, తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపిస్తాడని ఆశలు పెట్టుకొన్న వాళ్లకు ఇప్పటి వరకూ అది జరగకపోయే సరికి..అది జరుగుతుందన్న ఆశ క్రమంగా అడుగంటుతోంది. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఆ విషయాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాను అని అంటుండే సరికి.. వాళ్లు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. బాబు మాట తప్పే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి పోరాడటం వల్లనైనా.. బాబు రుణమాఫీని ప్రతిష్టగా తీసుకొని అమలు చేస్తే.. మంచిదని వారు కోరుకొంటున్నారు. ఈ విషయంలో జగన్ పో రాటానికి వారు కూడా మద్దతునిచ్చే అవకాశాలున్నాయి. మరి మొత్తంగా రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు రుణమాఫీ చుట్టూరానే తిరుగుతున్నాయి. ఈ అంశంలో తెలుగుదేశం ఫెయిల్యూర్స్ జగన్ కు అస్త్రంగా మారే అవకాశం ఉంది. మరి ఇకపై ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొంటాయి. రుణమాఫీ వ్యవహారం తెలుగుదేశం పార్టీని ఎక్కడి వరకూ తీసుకెళ్తుంది? అనేవి భవిష్యత్తుతో ముడిపడిన ఆసక్తికరమైన పరిణామాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: