తరుణ్ నటించిన కొత్త శశిరేఖాపరిణయం సినిమా గుర్తుందా.. అందులో రచయిత పరుచూరి గోపాలకృష్ణ పాత్ర ఓ అద్భుతమైన డైలాగ్ కొడుతుంది. లాయర్ గోపాలకృష్ణ.. కత్తులతో కాదు.. లీగల్ నోటీసుతో కొడతా.. అంటూ రంకెలేస్తాడు. ఔను మరి.. చేతులకు మట్టి అంటకుండా అవతలివాడిని హింసించే లా పాయింట్లు ఉండగా.. ఆయుధాలెందుకు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అధినాయకులు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. ముఖ్యమంత్రి స్థానం నుంచి ఏకంగా ప్రధానమంత్రి కావాలని ఆశపడి.. బొక్కబోర్లా పడ్డ నెలరాజు.. అరవింద్ కేజ్రీవాల్ పై ఇదే అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. మొత్తం 70 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీపీకి కేవలం 28మాత్రమే వచ్చాయి. కేజ్రీవాల్ పార్టీకి కూడా అన్నే సీట్లు వచ్చినా..కాంగ్రెస్ అండతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 50 రోజుల్లోనే రాజీనామా చేశారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. 8 మంది ఎమ్మెల్యేలకు వలవేసి అధికార పీఠం దక్కించుకోవాలని పావులు కదుపుతోందని సమాచారం. ఇదే అంశాన్ని కేజ్రీవాల్ గట్టిగా విమర్శించారు. కేజ్రీవాల్ రాజీనామా తర్వాత ఆప్ లో లుకలుకలు మొదలయ్యాయి. ఆప్ పరిణామాలు గమనించిన భాజపా.. వలసలను ప్రోత్సహిస్తోంది.దీంతో అసలే రెంటికీ చెడ్డ రేవడిగా మారిన కేజ్రీవాల్ కమలనాథుల వైఖరిపై మండిపడ్డారు. ఒక్కో ఆప్ ఎమ్మెల్యేకు 20 కోట్లు లంచం ఇస్తామని ఆఫర్ బీజేపీనేతలు ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై బీజేపీ మండిపడింది. మాటలతో సరిపెట్టకుండా కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ కేసు పెట్టింది. ఇప్పటికే.. బీజేపీ నేత నితిన్ గడ్కరీ కేజ్రీవాల్ ను అవినీతి ఆరోపణలు చేశారంటూ కోర్టు కీడ్చారు. ఈ కేసులో కేజ్రీవాల్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కొత్త మరో కేసు తోడవడంతో.. కేజ్రీవాల్ కు మళ్లీ కోర్టుల చుట్టు తిరక్కతప్పదేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: