రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ తమది రైతు ప్రభుత్వమని, రైతన్న అభివృద్దియే తమ ధ్యేయమని బీరాలు పలుకుతుంటే మరో పక్క ముఖ్యమంత్రి మాటలను లెక్కచేయని విద్యుత్‌ అధికారులు బక్కచిక్కిన రైతులపై విద్యుత్‌ మొండి బాకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లను తొలగించి, స్టాటర్‌ డబ్బాలతో సహ ఎత్తుకెళ్ళిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ వ్యవసాయ కనెక్షన్‌లను తొలగించవద్దంటూ బాధితులు అధికారుల కాళ్ళావేళ్ళాపడి వేడుకున్నప్పటికీ కనుకరించని విద్యుత్‌ అధికారులు తమ పనిని యధేచ్ఛగా కానిచ్చారు. అసలే వర్షలు లేక రైతులకు ఖరీప్‌ సాగు కష్టతరమై కరువు కోరల్లో చిక్కుల్లో చిక్కుకున్న రైతన్నను విద్యుత్‌ అధికారులు మొండిబకాయిలు, డిడిలు కట్టాలంటూ వేధించడమే కాకుండా, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు తొలగించి కరెంట్‌వైర్లు, మీటర్‌ కనెక్షన్‌ డబ్బాలతో సహా తీసుకెళ్ళిపోయారు. రాష్ట్ర రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజవర్గంలోని పెద్దేముల్‌ మండలంలో జరిగిన యధార్థ సంఘటన ఇది. బండమీదిపల్లి, ఆడ్కిచర్ల, జయరాంతాండా తదితర గ్రామాలలో విద్యుత్‌ కనెక్షన్‌లు తొలగించారు. ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ రైతులకు పెద్దపీట వేస్తామనీ, ప్రతి రైతునూ లక్షాధికారులను చేస్తామని పేర్కొంటుంటే, విద్యుత్‌ అధికారులు మాత్రం సిఎం వాగ్దానాలను తుంగలో తొక్కుతూ రైతన్నలను నిలువునా ముంచుతున్నారు. వర్షాలు సకాలంలో కురియక పోవడంతో ఖరీప్‌ సాగు ఆలస్యమైంది. కురిసిన కాస్తో కూస్తో వర్షానికి పంటలు విత్తుకున్నప్పటికీ మేఘాలు మొహం చాటేయడంతో రైతన్న పరిస్థితి దీనంగా మారింది.  ఖరీప్‌ ఇలా దెబ్బతిస్తుంటే ఉన్న కాస్త భూమిలో తరిపంటలను సాగు చేసుకుని బ్రతుకు వెళ్ళదీద్దామని ప్రయత్నిస్తున్న రైతన్నలపై విద్యుత్‌ అధికారులు బకాయిలు చెల్లించాలంటూ దాష్టీకానికి ఒడిగట్టారు. విద్యుత్‌ అధికారుల చర్యలతో చేసేదేమి లేక గత వారం రోజులుగా సాగు చేసిన పంటలకు నీరందించలేక పోవడంతో రైతన్న బాధలు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వమే ఓ పక్క రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ˜ి చేస్తూ రైతుకు అండగా నిలుస్తుంటే విద్యుత్‌ అధికారులు నిర్దాక్షిణ్యంగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లను తొలగిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైన మంత్రులు అధికారులు స్పందించి విద్యుత్‌ అధికారుల దాష్టికాన్ని అడ్డుకుని రైతన్నలను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: